రగ్బీ జిల్లా జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

రగ్బీ జిల్లా జట్టు ఎంపిక

Published Sat, May 25 2024 1:40 PM

-

తాళ్లూరు (ముండ్లమూరు): ప్రకాశం జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్‌ (18 ఏళ్ల వయసు లోపు) బాల బాలికల జట్ల ఎంపిక ఈ నెల 27వ తేదీన మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ రవిప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకనటలో తెలిపారు. రగ్బీ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, నాలుగు పాస్‌ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో భీమిలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి ఎస్‌ శ్రీకాంత్‌ గణేష్‌ తెలిపారు.

డీఎల్‌పీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

మార్కాపురం టౌన్‌: మార్కాపురం డివిజన్‌ పంచాయతీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జీ శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు మార్కాపురంలోని డీఎల్‌పీఓ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేయడంతో ఆమె జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో డీపీవో విచారణ నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక పంపడంతో శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడికి బెయిల్‌

దర్శి: ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు వీసీరెడ్డికి బెయిల్‌ మంజూరైంది. దర్శి సబ్‌ జైల్‌లో ఉన్న వీసీరెడ్డి శుక్రవారం బెయిల్‌ పై బయటకు వచ్చారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో దర్శి పట్టణంలోని పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలు పగులగొట్టిన వీసీరెడ్డిని పోలీసులు పట్టుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 22వ తేదీన అద్దంకి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించారు.

సెల్యూట్‌ కొట్టలేదని..

అటెండర్‌పై భగ్గుమన్న ఉన్నతాధికారి

నెలజీతం కట్‌ చేయాలంటూ సూపరింటెండెంట్‌కు ఆదేశం

ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్‌లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్‌ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్‌ లేచి సెల్యూట్‌ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్‌ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంభోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు. అటెండర్‌ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్‌ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్‌ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు

కనిగిరి రూరల్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జే ఉషారాణి తెలిపారు. స్థానిక కళాశాలలో శుక్రవారం సీపీడీసీ సభ్యులు, కళాశాల సిబ్బంది, ఏపీ ఈడబ్ల్యూడీసీ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం ఉషా 2024 పథకం కింద మంజూరైన నిధులను కళాశాలలో నూతన తరగతి గదుల నిర్మాణం, కళాశాల భవనాల పునరుద్ధరణ, భౌతిక, డిజిటల్‌ తరగతులలో మౌలిక వసతుల కల్పన, వైఫై కనెక్టివీటి, నాలుగు కాంపోనెంట్స్‌కు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, కళాశాల సీపీడీసీ సభ్యుడు ముక్కు బాలకష్ణారెడ్డి, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమణారెడ్డి, రాచమళ్ల శ్రీనివాసులరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement