Sakshi News home page

ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ.. కీలక హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ చీఫ్‌

Published Thu, Dec 15 2022 2:04 AM

Congress Komatireddy Venkat Reddy Met With Mallikarjun Kharge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలపై పార్టీ అధిష్టానానికి నాయకుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ, పార్టీ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బుధవారం కలిశారు. 

సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను, సమన్వయలోపం కారణంగా పార్టీ ఏ విధంగా నష్టపోతోందనే అంశాలతో పాటు మర్రి శశిధర్‌రెడ్డి లాంటి సీనియర్‌ నాయకులు పార్టీని వీడడానికి కారణాలను ఖర్గేకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కేడర్‌ బలంగా ఉన్నప్పటికీ సమన్వయలోపం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  తెలిపారు. నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో అందుబాటులో ఉండరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోందన్న విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు.  

కీలకమైన విషయాల్లోనూ రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్ల అభిప్రాయాలను సైతం కనీసం తీసుకోవట్లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా పార్టీ అధ్యక్షుడిగా నష్టనివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కోమటిరెడ్డి ప్రస్తావించిన అంశాలను విన్న మల్లికార్జున ఖర్గే.. ఈ అంశాలన్నీ తన దృష్టిలో ఉన్నాయని.. త్వరలోనే రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement