Sakshi News home page

దివికేగిన లక్కీ హ్యాండ్‌..

Published Sun, Nov 12 2023 1:48 AM

విజయవాడలో చంద్రమోహన్‌ను పురస్కారంతో సత్కరిస్తున్న దృశ్యం (ఫైల్‌) - Sakshi

అన్న మృతి బాధాకరం

అన్న చంద్రమోహన్‌ మృతి మా కుటుంబానికి ఎంతో బాధాకరం. రెండు రోజుల కిందట కూడా మాట్లాడాను. ప్రతి సంవత్సరం గ్రామానికి వచ్చి నా దగ్గర ఉండి వెళ్లేవారు. రాష్ట్రంలో ఎక్కడ షూటింగ్‌ ఉన్నా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు.

– మల్లంపల్లి దుర్గా ప్రసాదరావు, తమ్ముడు

కళా రంగానికి తీరనిలోటు

చంద్రమోహన్‌ లాంటి గొప్ప నటుడు మా నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల గ్రామం కావడం మాకు గర్వకారణం. ఆయన మృతి కళారంగానికి తీరని లోటు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

– కై లే అనిల్‌కుమార్‌, పామర్రు ఎమ్మెల్యే

పమిడిముక్కల: సినీ నటుడు చంద్రమోహన్‌

మృతితో ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పమిడిముక్కలలో విషాదఛాయలు అలముకొన్నాయి. చంద్రమోహన్‌ మృతి సమాచారం తెలియగానే ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శ్యాంబవమ్మలకు 8 మంది కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 7వ సంతానంగా 1942 మే 23వ తేదీన జన్మించిన మల్లంపల్లి చంద్రశేఖరరావు (చంద్రమోహన్‌) స్వగ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. మేడూరు

హైస్కూల్లో ఉన్నత విద్య, మచిలీపట్నం హిందూ కాలేజీలో పీయూసీ, బాపట్ల వ్యవసాయ కాలేజీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేశారు. 1964–66 వరకు ఏలూరులో వ్యవసాయశాఖ అధికారిగా పనిచేశారు. 1966లో సినీ రంగప్రవేశం చేశారు. రంగులరాట్నం ఆయన మొదటి సినిమా. 900 కు పైగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బంగారు పిచ్చుక చంద్రమోహన్‌కు ఇష్టమైన సినిమా. తమిళ సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడంతో అప్పట్లో మద్రాస్‌ తరలివెళ్లారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కథా నాయకుడిగా, కుటుంబ కథా చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేశారు. చంద్రమోహన్‌ది లక్కీ హ్యాండ్‌ అని ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉండేది. జయప్రద, జయసుధ మొదలు సుహాసిని వరకు తొలినాళ్లలో ఆయన పక్కన నటించిన వాళ్లే.

స్వగ్రామంతో అనుబంధం.....

చంద్రమోహన్‌కు స్వగ్రామంతో విడదీయరాని అనుబంధం ఉంది. తానెంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్వగ్రామం వస్తారు. బంధువులు, కుటుంబసభ్యులను కలుసుకునేవాళ్లు. కొబ్బరితోటలో ఉన్న తల్లిదండ్రుల సమాధులను సందర్శించి నివాళులర్పించేవారు. పమిడిముక్కల హైస్కూల్‌కు ఆర్థిక సహాయం

అందజేశారు. వీరంకిలాకులో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించినప్పడు చంద్రమోహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులు చంద్రమోహన్‌కు పౌరసన్మానం చేశారు. చంద్రమోహన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి డాక్టర్‌గా మద్రాస్‌లో స్థిరపడ్డారు. విజయవాడ నగరంతోనూ ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. సినీ రంగ ప్రవేశం జరిగాక పలు సందర్భాల్లో బెజవాడ వచ్చారు. ఇక్కడ చాలా మంది ఆయనకు సన్నిహిత మిత్రులున్నారు. శుభోదయం సినిమా షూటింగ్‌ విజయవాడలోనే కొంత భాగం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని సన్మానాలు, పురస్కారాలు పొందారు.

సినీ దిగ్గజం చంద్రమోహన్‌ కన్నుమూత స్వగ్రామంలో బంధువులు, స్నేహితుల విచారం కృష్ణా జిల్లాతో విడదీయరాని అనుబంధం

Advertisement

What’s your opinion

Advertisement