Sakshi News home page

కరువు రైతుకు ఊరట

Published Mon, Nov 20 2023 2:04 AM

- - Sakshi

● ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను సవరించిన ప్రభుత్వం ● టీడీపీ హయాంతో పోలిస్తే అన్ని పంటలకు పెరిగిన పరిహారం ● మొదటి సారిగా మొక్క జొన్నకు రూ.12,500 పరిహారం ● కరువు మండలాల్లో ఎన్యూమరేషన్‌కు ఆదేశాలు ● ఈ నెల 25 నాటికి ఎన్యూమరేషన్‌ పూర్తి.. 28లోగా ప్రభుత్వానికి నివేదిక ● ప్రాథమిక అంచనాల ప్రకారం 2.76 లక్షల హెక్టార్లలో పంట నష్టం

ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా ఎన్యూమరేషన్‌

కరువు మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌ పకడ్బందీగా చేపట్టడానికి చర్యలు తీసుకున్నాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతాం. ఎన్యూమేషన్‌పై ఇప్పటికే ఏడీఏ, ఏవోలకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని రకాల పంటలకు చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కరువు రైతులకు ఊరట కలిగించే విషయం. ఎన్యూమరేషన్‌ జాబితాలను సోషల్‌ ఆడిట్‌కు కూడా పెడుతాం. ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా ఎన్యూమరేషన్‌ జరుగుతుంది. – పీఎల్‌ వరలక్ష్మి,

జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు

కర్నూలు(అగ్రికల్చర్‌): వర్షాభావంతో దెబ్బతిన్న రైతులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరువు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌కు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ పండ్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద వివిధ పంటలకు చెల్లించే పరిహారాన్ని సైతం సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం చొరువ తీసుకొని ఆయా జిల్లాల యంత్రాంగం నుంచి వచ్చి న ప్రతిపాదనల మేరకు కర్నూలు జిల్లాలో 24, నంద్యాల జిల్లాలో 6 మండలాలను.. మొత్తంగా 30 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. కర్నూలు జిల్లాలో 26 మండలాలు ఉండగా.. తుగ్గలి , కర్నూలు రూరల్‌ మండలం మినహా మిగిలిన అ న్ని మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది.నంద్యాల జిల్లాలో బనగానపల్లె, మిడుతూరు, పగిడ్యాల, గడివేముల, బేతంచెర్ల, పాణ్యం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.

రెండు హెక్టార్ల వరకు పంట నష్టం నమోదు

కరువు మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరువు మండలాల్లో 2 హెక్టార్ల వరకు పంట నష్టం నమోదు చేస్తారు. కనీసం 33 శాతం నష్టం జరిగిన పంటలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామ స్థాయిలో వీఏఏ, వీఆర్‌వోలు ఒక బృందంగా ఏర్పడి ఎన్యూమరేషన్‌ చేస్తారు. మండల స్థాయిలో వ్యవసాయ అధికారి, తహసీల్దారు, డివిజన్‌ స్థాయిలో ఏడీఏలు, ఆర్‌డీవోలు ఎన్యూమరేషన్‌ పర్యవేక్షిస్తారు. ఎన్యూమరేషన్‌ డేటాను ఈ నెల 23లోగా సాఫ్ట్‌కాపీ పంపాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి ఆదేశించారు. ఈ నెల 25లో ఎన్యూమరేషన్‌ జాబితాలను సోషల్‌ ఆడిట్‌కు పెట్టి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించి సాఫ్ట్‌, హార్డ్‌ కాపీలను పంపాలని ఆదేశారు. జిల్లా స్థాయిలో ఎన్యూమేషన్‌ జాబితాలను సమన్వయం చేసి ఈ నెల 28లోగా వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్‌ ద్వారా డిజాస్టర్‌ మేనేజ్‌మెంటుకు పంపుతారు.

రైతుల అభ్యున్నతి లక్ష్యంగా...

రైతుల అభ్యన్నతి లక్ష్యంగా స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ పండ్‌ కింద జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది. టీడీపీ హయాంలో 2014–15 నుంచి 2018–19 వరకు ప్రతి ఏటా కరువు వచ్చినప్పటికీ మార్గదర్శకాలను సవరించలేదు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా వైఎసార్‌సీపీ ప్రభుత్వం సవరించడం విశేషం. దీంతో కరువు మండలాల్లో రైతులు ఏ పంట సాగు చేసినా పరిహారం పొందే అవకాశం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని 24 కరువు మండలాల్లో పత్తి 2,76,715, మిరప 30 వేలు, ఉల్లి 8,842 హెక్టార్లు, నంద్యాల జిల్లాలోని 6 కరువు మండలాల్లో 32,822 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 2 హెక్టార్లలోపు 33 శాతం ఆపైన నష్టపోయిన రైతులను ఎన్యూమేషన్‌ ద్వారా గుర్తిస్తారు. ఉద్యాన పంటలకు సంబంధించి వర్షాధారం పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

పెరిగిన పరిహారం...

గతంలో వరి, వేరుశనగ, పత్తి, చెరకు, పసుపు, మిర ప, కూరగాయలు, ఉల్లి, పూలు, బొప్పాయ పంటలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.15,000 పరిహారం చెల్లించేవారు. తాజాగా ప్రభుత్వం ఈ పంటలకు పరిహారాన్ని హెక్టారుకు రూ.17 వేలకు పెంచెంది. గతంలో మొక్కజొన్నకు ఎలాంటి పరిహారం లేదు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు హెక్టా రు రూ.12,500 పరిహారం చెల్లిస్తారు. గతంలో జొన్న,సజ్జ, రాగులు, ఆముదం పంటలకు పరిహా రం రూ.6800 మాత్రమే ఉండింది. నేడు ఈ పంటలతో పాటు కొర్ర, జనుము, సామలు, వరిగలు పంటలకు పరిహారాన్ని రూ.8,500 పెంచారు. టీడీపీ హయాంలో జనుము, నువ్వులు, కొర్రలు, సామ లు, వరిగ, ఆవాలు పంటలకు రూ.5,000 మాత్రమే పరిహారం ఉండేది. పప్పు దినుసు పంటలు, పొగాకు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, వాము పంటలకు రూ.10 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తారు. సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది.

Advertisement
Advertisement