ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Wed, May 22 2024 5:20 AM

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్‌: ఈనెల 24నుంచి జూన్‌ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ సీతారామారావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటలకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలను ఆయా రూట్‌ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా మంచినీటి వసతి కల్పించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, తగినంత గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మొదటి సంవత్సరం 4,037 మంది, ద్వితీయ సంవత్సరం 2,511 మందితో కలిపి మొత్తం 6,548, మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 21 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంట్‌ అధికారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement