మల్లన్న జలాలతో సిరులే.. | Sakshi
Sakshi News home page

మల్లన్న జలాలతో సిరులే..

Published Thu, May 9 2024 10:25 AM

-

నర్సాపూర్‌/నర్సాపూర్‌రూరల్‌: మల్లన్నసాగర్‌ కాలువల ద్వారా సాగు నీరు వస్తే నర్సాపూర్‌ బంగారు తునక అవుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సాపూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్‌ను లింకు చేయడానికి శంకరంపేట నుంచి కాలువల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పా రు. మల్లన్నసాగర్‌ నుంచి ఒక్కసారి నీరు రావడం మొదలైతే నర్సాపూర్‌ సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలువల నిర్మాణం పూర్తయి నీళ్లు రావాలంటే మెదక్‌ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలిచినప్పటి నుంచి కాలువల నిర్మాణంలో స్పీడ్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్‌ పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే నా కల అన్నారు. నర్సాపూర్‌ను ఎంతో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇచ్చామని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ వెనక్కి తీసుకుపోయిందని ఆరోపించారు. కొల్చారంలో మల్లినాథసూరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తాను నిర్ణయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ హయాంలో హల్దీ వాగు, మంజీరాపై 10 చెక్‌ డ్యాంలు నిర్మించామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారని చెప్పారు.

సస్యశ్యామలం చేయడమే నా కల

అందుకు ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం

నర్సాపూర్‌ కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement