భద్రత కట్టుదిట్టం | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం

Published Thu, May 9 2024 10:20 AM

భద్రత

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భత్రత ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి తెలిపారు. ఈసీ నిబంధనలు ధిక్కరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 1500 మంది సిబ్బందితో పాటు మూడు పారా మిలటరీ బలగాలను రప్పించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో పలు అంశాలను వెల్లడించారు. –మెదక్‌జోన్‌

1500 మంది సిబ్బందితో బందోబస్తు

మూడు కంపెనీల కేంద్ర బలగాలు

జిల్లాలో 45 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు

‘సాక్షి’తో ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి

పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్పీ: సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రతీ పోలింగ్‌స్టేషన్‌కు ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు సిబ్బందిని నియమించాం. జిల్లావ్యాప్తంగా 15 వందల మంది సిబ్బందిని కేటాయించాం. అలాగే మూడు కంపెనీల కేంద్ర బలగాలను దించాం.

జిల్లాలో మొత్తం ఎన్ని పోలింగ్‌స్టేషన్లు ఉన్నా యి? వాటిలో సమస్యాత్మకమైనవి ఎన్ని?

జిల్లాలో మొత్తం 770 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో 45 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వాటిని 78 రూట్లుగా గుర్తించి ఒక్కో రూట్‌కు ఒక్కో ఆర్మ్‌డ్‌ ఎస్కార్డ్‌లను కేటాయించాం. ఈవీఎం పంపిణీ సెంటర్‌ నుంచి పోలింగ్‌స్టేషన్‌ వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్‌ మొబైల్‌లో వైర్‌లెస్‌ సెట్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూంకు కనెక్ట్‌ చేశాం. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం.

జిల్లా సరిహద్దులో ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు?

జిల్లా చుట్టూ ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి సరిహద్దులో 9 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. పోలీస్‌ సిబ్బందితో పాటు జిల్లాకు చెందిన ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది సైతం 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా 9 ఎస్‌ఎస్‌టీ టీమ్స్‌, 9 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 24 గంటల పాటు నిఘా పెట్టారు.

తనిఖీల్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సీజ్‌ చేశారు?

ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.88 లక్షల 57 వేల 678 నగదు సీజ్‌ చేశాం. అలాగే నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న బెల్టుషాపుల నుంచి 3,300 లీటర్ల మద్యం సీజ్‌ చేశాం. ఇది రూ.15 లక్షల విలువ ఉంటుంది. రామాయంపేటలోని ఓ లాడ్జిలో అక్రమంగా నిల్వ ఉంచిన 202 చీరలను సైతం పట్టుకున్నాం. వీటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే 2 వేల క్వింటాళ్ల బియ్యం సైతం పట్టుకున్నాం. దీని విలువ రూ. 40 లక్షలుగా గుర్తించాం. రూ.1 కోటి 45 లక్షల 91 వేల విలువ చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేశాం. నగదుకు సంబంధించి తగు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇచ్చేశాం.

సీజ్‌ చేసిన డబ్బులో రాజకీయ నాయకులది ఉందా?

పట్టుకున్న నగదులో ప్రత్యేకంగా రాజకీయ నాయకులదని గుర్తించలేదు. కానీ ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి మాత్రం స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బును డీజీసీకి నివేదించాం. నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

ఎన్నికల ఉల్లంఘన కేసులు ఎన్ని నమోదయ్యాయి?

జిల్లావ్యాప్తంగా 6 ఎంసీసీ వాయిలెన్స్‌ కేసులు నమోదయ్యాయి. అందులో విచారణ పూర్తయింది. త్వరలోనే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

ఇప్పటివరకు ఎంత మందిని బైండోవర్‌ చేశారు?

గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాత నేరస్తులు 800 మందిని గుర్తించి బైండోవర్‌ చేశాం. ఒక్కసారి బైండోవర్‌ చేసిన వ్యక్తులు ఏడాది వరకు ఏదైనా వాయిలెన్స్‌లో పాల్గొంటే మరోసారి బైండోవర్‌ చేయాల్సి ఉంటుంది. పాత నేరస్తుల్లో అలాంటి వారు లేరు. కొత్తగా 173 కేసుల్లో 241 మందిని పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్‌ చేశాం.

సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వైరల్‌ చేశారా?

సోషల్‌ మీడియాలో రెండు అభ్యంతరకర పోస్టులు వైరల్‌ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.

ఈసీ నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నేతలు వ్యవహరించినట్లు గుర్తించారా?

ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు అనుమతి తీసుకొనే సభలు, కార్నర్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వారిపై మా సిబ్బంది అనుక్షణం నిఘా పెట్టారు. ఈసీ నిబంధనలను పాటించకుంటే చర్యలుంటాయి.

భద్రత కట్టుదిట్టం
1/1

భద్రత కట్టుదిట్టం

Advertisement
 
Advertisement
 
Advertisement