పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Published Mon, Nov 27 2023 11:48 PM

మాట్లాడుతున్న  జిల్లా ఎన్నికల అధికారి, 
కలెక్టర్‌ బి. సంతోష్‌, సీపీ రెమా రాజేశ్వరి - Sakshi

● జిల్లాలో 159 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ● 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ● మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగింపు ● మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేత ● స్థానికేతరులు వెళ్లిపోవాలి.. ● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌, సీపీ రెమా రాజేశ్వరి

మంచిర్యాల అగ్రికల్చర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 30న నిర్వహించే పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, డీసీపీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాలో 741 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 159 సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. జిల్లాలో ఓటింగ్‌ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకని తెలిపారు. ఈ సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటువేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. భారీగా క్యూలో ఉంటే రాత్రి వరకు అయిన ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఐదు మహిళా కేంద్రాలు, ఐదు మోడల్‌ కేంద్రాలు, ఐదు యూత్‌, ఒక దివ్యాంగుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 357 మంది దరఖాస్తు చేసుకోగా 331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ, ర్యాంపు, వీల్‌చైర్స్‌, వలంటీర్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఎన్నికల సిబ్బంది ఒక రోజు ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారని తెలిపారు. ప్రతీది వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వెబ్‌కాస్టింగ్‌ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

నేటి సాయంత్రంతో ప్రచారం నిలిపివేత..

ఓటింగ్‌ సమయానికి 48 గంటల ముందే అభ్యర్థులు ప్రచారం ముగించాలని, మద్యం దుకాణాలు సైతం మూసి ఉంచాలని తెలిపారు. స్థానికంగా ఓటరు కానివారు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. నగదు, మద్యం, ఇతరత్రా గిఫ్ట్‌ ఐటమ్స్‌తో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నేరచరిత్ర ఉన్న, గతంలో ఎన్నికల సమయంలో హింసకు పాల్పడిన 114 మంది, 65 మంది రౌడీషీటర్లను బెండోవర్‌ చేశామని వివరించారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు రావాణా సౌకర్యంతోపాటు రూట్‌మ్యాప్‌ ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు.

Advertisement
Advertisement