వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలి | Sakshi
Sakshi News home page

వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలి

Published Sat, May 25 2024 1:00 PM

వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: కొత్తగా శిక్షణ పొందుతున్న ప్రతిఒక్కరూ సమాజంలో ఆదర్శవంతమైన పోలీస్‌ అధికారిగా తయారవ్వాలని మల్టీజోన్‌–2 ఐజీ జి.సుధీర్‌బాబు అన్నారు. జడ్చర్లలోని పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి ముందుగా మొక్క నాటారు. ఆ తర్వాత కొత్తగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఐజీ మాట్లాడారు. పోలీస్‌ శాఖలో ఉద్యోగం చేయడం అంటే సమాజ సేవలో పాల్గొనడమే అన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతిఒక్కరూ వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రతినిత్యం ఇండోర్‌, అవుట్‌ డోర్‌లో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణలో విజ్ఞానం పెంచుకోవాలన్నారు. విధుల్లో చేరిన తర్వాత సమాజం గర్వించే విధంగా మీ ప్రవర్తన ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేసే విధానాలు చాలా మారాయని, వీటిలో అతి ముఖ్యమైంది సైబర్‌ నేరాలని, దీనిపై ప్రతిఒక్కరూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్‌ నేరాల్లో మంచి శిక్షణ తీసుకుని, వాటిపై పట్టుసాధించి విధుల్లో చేరిన తర్వాత సైబర్‌ నేరాలు ఛేదించడంలో కీలకపాత్ర పోషించాలని చెప్పారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్‌ చిత్తరంజన్‌, ఏఎస్పీ రాములు, డీటీసీ డీఎస్పీ నర్సింహులు, మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement