మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం

Published Sat, May 25 2024 12:55 PM

మన్యం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహ (ఓబులేశు) స్వామివారి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలకు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయ రీతిలో స్నానం జరిపించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో గరుడ వాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ సేవ ముందుకు కదిలింది. భక్తుల హరినామస్మరణతో సేవా ప్రాంతం మార్మోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో స్వామివారు గరుడ వాహనంపై దేవస్థానం పరిసరాల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి విశేషోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, అర్చకులు పాల్గొన్నారు.

మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
1/1

మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం

Advertisement
 
Advertisement
 
Advertisement