పోలింగ్‌ బహిష్కరించిన చింతలగడ్డ వాసులు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బహిష్కరించిన చింతలగడ్డ వాసులు

Published Tue, May 14 2024 12:50 PM

పోలింగ్‌ బహిష్కరించిన చింతలగడ్డ వాసులు

మరిపెడ రూరల్‌: సుదూర ప్రాంతంలో ఉన్న తమ తండాలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని కొద్ది రోజులుగా విన్నవించినా తమ మాటను అధికారులు లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్‌ మండలం చింతలగడ్డతండా వాసులు సోమవారం పోలింగ్‌ బహిష్కరించారు. తాళ్లఊకల్‌ రెవెన్యూ పరిధిలోని చింతలగడ్డతండా, రేఖ్యతండా, రూప్‌సింగ్‌తండాను కలిపి చింతలగడ్డతండా జీపీగా ఏ ర్పాటు చేశారు. 295 ఓట్లు ఉన్న చింతలగడ్డతండాలో పో లింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని 20 రోజులుగా అధికారులకు విన్నవిస్తే పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రూప్‌సింగ్‌ తండాలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి నడవలేక పోతున్నామని, కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓటు వేయడానికి వెళ్లమని తండావాసులు మొండికేశారు. విషయం తెలుసుకున్న మరిపెడ తహసీల్దార్‌ సైదులు, సీఐ హతిరాంనాయక్‌, ఎస్సై షేక్‌ తాహేర్‌బాబా.. తండాకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ససేమిరా అనడంతో చేసేది లేక ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి తండాకు బూత్‌ మంజూరయ్యేలా చూస్తామని సర్ది చెప్పి వెనుదిరిగారు. కాగా, అధికారులు వెళ్లాక కేవలం 15 మంది మాత్రమే వెళ్లి రూప్‌ సింగ్‌తండా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలిసింది.

బూత్‌ ఏర్పాటు చేయకపోవడంపై నిర్ణయం

295 ఓట్లకు గానూ 15 మందే ఓటు హక్కు వినియోగం

Advertisement
 
Advertisement
 
Advertisement