మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌

Published Thu, Nov 16 2023 1:32 AM

పాలకుర్తి: దయాకర్‌రావుకు గొర్రె పిల్లను బహూకరిస్తున్న వృత్తిదారులు  - Sakshi

పాలకుర్తి/రాయపర్తి: ప్రజల దీవెనలతో కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలో గొల్ల, కురుమలు నిర్వహించిన ర్యాలీ అనంతరం బషారత్‌ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బక్క నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో దయాకర్‌రావు మాట్లాడారు. గొల్ల కురుమలను గత పాలకులు పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌ సర్కారు వారికి జీవనోపాఽధి కల్పించడానికి సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెంపునకు రూపొందించిన ఈ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వృత్తిదారులకు మరిన్ని రుణాలు ఇప్పించడానికి సీఎం పట్టుదలతో ఉన్నారని, బీఆర్‌ఎస్‌ను ఆదరించి అధికారంలోకి తేవాలని కోరారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను.. ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని దయాకర్‌రావు అన్నారు. సభలో ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదేవి, స్వచ్ఛంద సంస్థల నాయకుడు డాక్టర్‌ భిక్షపతి, పండుగ నారాయణ, సలేంద్ర సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

తండాలను పంచాయతీలు చేశాం..

పాలకుర్తి మండలంలోని సిరిసన్నగూడెం, కంభాలకుంట తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దుర్భరంగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అన్ని వసతులు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ సర్కారుదే అని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా.. ఎంతో మంది పేదలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ రూ.400కే ఇస్తామని అన్నారు.

కార్యకర్తలను కాపాడుకుంటా..

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండలం మహబూబ్‌నగర్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కంజర్ల ఎల్లయ్య, కొలన్‌పల్లికి చెందిన 30 మంది యువకులు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు పాలకుర్తి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు గబ్బెట బాబు, కాంచనపల్లి వనజారాణి, గజవెల్లి అనంత, భూక్య క్రాంతి, చెన్నబోయిన రవి, సురేష్‌, టీఎం రంగాచారి, ఆలకుంట స్వామి, వంగాల నర్సయ్య, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ చిట్యాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గౌడల మద్దతు..

ఎన్నికల్లో మంత్రి దయాకర్‌రావుకు గౌడల మద్దతు ఉంటుందని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు లక్ష్మణ్‌గౌడ్‌ అన్నారు. బుధవారం ఆయన పాలకుర్తి, జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ సర్కారు గౌడల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఏటా రూ.20 కోట్ల రెంటల్‌ మాఫీ చేసిందన్నారు. 103 సొసైటీలను నూతనంగా తెరి పించడంతోపాటు వైన్‌ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని చెప్పారు. పార్టీని తిరిగి అధికా రంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజు, గట్టు రమేష్‌, ఏకాంతం, విద్యాసాగర్‌, మూల వెంకటేశ్వర్లు, పోశాలు వెంకన్న, కమ్మగాని పరమేశ్వర్‌, గిరగాని సమ్మయ్య, కమ్మగాని నాగన్న పాల్గొన్నారు.

గొల్ల కురుమలకు మరిన్ని రుణాలు

గ్యాస్‌ సిలిండర్‌ రూ.400కే ఇస్తాం

ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా..

ప్రజా ఆశీర్వాద సభలో

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి: మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎల్లయ్య తదితరులు
1/2

రాయపర్తి: మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎల్లయ్య తదితరులు

సిరిసన్నగూడెంలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి
2/2

సిరిసన్నగూడెంలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి

Advertisement
Advertisement