Sakshi News home page

ముగ్గురు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

Published Thu, Mar 28 2024 1:25 AM

మోసగాళ్లను అరెస్టు చూపుతున్న
 సైబర్‌ అనాలసిస్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌   - Sakshi

కర్నూలు : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన నవీన్‌ కుమార్‌, అతని తమ్ముడు అరుణ్‌ కుమార్‌, బావమరిది మహేష్‌లను కర్నూలు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా బుధవారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌ సైబర్‌ క్రైం అనాలసిస్‌ టాస్క్‌ఫోర్‌ టీమ్‌ సీఐ ఎస్‌.నగేష్‌ బాబు వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన జంగం వీరలక్ష్మిని స్నేహితురాలు మాధురి ద్వారా నవీన్‌ కుమార్‌ పరిచయం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఎస్‌ఏ ట్రేడింగ్‌ కంపెనీలో మినిమమ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేస్తే నెల రోజుల వరకు రోజూ కొంత మొత్తం ఆమె అకౌంట్‌కు జమ అవుతుందని మాయమాటలు చెప్పాడు. వీరలక్ష్మి సెల్‌ఫోన్‌కు లింక్‌ పంపి విడతల వారీగా రూ.4.87 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు వేసిన తర్వాత లింక్‌కు సంబంధించిన సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో వరలక్ష్మి.. నవీన్‌ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా త్వరలో ఓపెన్‌ అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ఆ తర్వాత అతని సెల్‌ఫోన్‌ కూడా పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైం అనాలసిస్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ రంగంలోకి దిగి కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు నగేష్‌ బాబు తెలిపారు. జిల్లాలో సుమారు 143 ఆన్‌లైన్‌ ఫిర్యాదులలో వీరు నేరస్థులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. నవీన్‌ కుమార్‌ కర్నూలులో నివాసముంటూ ఆన్‌లైన్‌లో ఎస్‌ఏ ట్రేడింగ్‌ కంపెనీ గురించి వివరిస్తూ బెంగుళూరులో కంపెనీ ఉందని, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రమణ నాగ్‌పాల్‌ ఉన్నారని నమ్మించేవారన్నారు. ఆన్‌లైన్‌లో జనరేట్‌ అయ్యే ఒక లింక్‌ ద్వారా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకుని అందులో పెట్టుబడి పెడితే నెల రోజుల తర్వాత నుంచి రోజుకు కొంత మొత్తం అకౌంట్‌కు జమ అవుతుందని మోసం చేశారన్నారు. అమాయక ప్రజలు చాలామంది అతని మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఆన్‌లైన్‌ బిజినెస్‌, ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఆన్‌లైన్‌ లింక్‌ బిజినెస్‌ తదితర పేర్లతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలా మోసపోతే తక్షణమే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కి (టోల్‌ఫ్రీ) లేదా ఠీఠీఠీ. ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ. gov. in కు ఫిర్యాదు చేయాలని లేదా దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 8వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ బందే సాహెబ్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ప్రవీణ్‌, బోస్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement