2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం | Sakshi
Sakshi News home page

2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం

Published Sun, May 12 2024 8:50 AM

2,400

వెల్లంకి(వీరులపాడు): మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని వెల్లంకి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను శనివారం ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం రావటంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. మొత్తం రూ.3.50 లక్షల విలువ చేసే 50 కేసుల్లో 2,400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నాయని అక్కడ ఎవరూ లేకపోవటంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడిలో ఎస్‌ఐ నాగేంద్రకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన మద్యం టీడీపీ నాయకులకు చెందినదిగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కావటంతో ఓటర్లకు పంచేందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కురుమద్దాలి(పామర్రు): విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి బల్లిపర్రు గ్రామానికి చెందిన కలపాల చంద్‌(24), బి.నాగేశ్వరరావులు తమ బైక్‌పై కురుమద్దాలి గ్రామానికి జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కురుమద్దాలి వద్దకు రాగానే బైక్‌ లారీని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చంద్‌ రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి నాగేశ్వరరావుకు గాయాలు అవ్వడంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

డివైడర్‌ను ఢీ కొన్న కారు.. వ్యక్తి మృతి

గౌరవరం(జగ్గయ్యపేట): డివైడర్‌ను కారు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గౌరవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన రెడ్డి సాయిప్రసాద్‌(58) తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు ఫంక్షన్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామంలోని జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు పంచర్‌ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ప్రసాద్‌ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. చిల్లకల్లు ఎస్‌ఐ సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం
1/1

2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం

Advertisement
 
Advertisement
 
Advertisement