ప్రత్యేక ప్రార్థనల్లోమంత్రి జోగి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ప్రార్థనల్లోమంత్రి జోగి

Published Mon, Apr 8 2024 1:50 AM | Last Updated on Mon, Apr 8 2024 1:50 AM

- - Sakshi

పెనమలూరు: పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఐదు జాగారాల పండుగలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పాల్గొన్నారు. కానూరు సనత్‌నగర్‌లో శనివారం రాత్రి లైలతుల్‌ ఖాదర్‌ నాలుగో రోజు రాత్రి జాగారం పండుగ షబేఖాదర్‌ నవాజ్‌లో మంత్రి పాల్గొని ప్రార్థన చేశారు. మంత్రి రమేష్‌ మాట్లాడుతూ పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. జగనన్న ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. నవరత్నాలతో పేద ముస్లింలకు న్యాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు అన్నే శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎంపీటీసీ సభ్యులు చాంద్‌ బాషా, ఖాదర్‌, పఠాన్‌ అహ్మద్‌, నేతలు లతీఫ్‌, రెహమాన్‌ పలువురు పాల్గొన్నారు.

రేపు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు

విజయవాడకల్చరల్‌: శత సహస్ర దీపార్చన (లక్ష) సేవా మండలి ఆధ్వర్యాన ఈ నెల 9వ తేదీ మంగళవారం దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో బాలబాలికలకు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తునట్లు కన్వీనర్‌ నాగలింగం శివాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్‌, సీనియర్స్‌ విభాగంలో పోటీలు ఉంటాయని ప్రవేశ రుసుం లేదని సంప్రదాయ వస్త్ర ధారణకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. విజేతలకు అదే రోజు బహుమతీ ప్రదానం చేస్తారని తెలిపారు. పేర్ల నమోదుకు 94410 35982, 99595 41222 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఉగాది సందర్భంగా పులిపాక చంద్రశేఖర శర్మ పంచాంగ పఠనం చేస్తారని తెలిపారు.

నిత్యాన్నదానానికి రూ. 2 లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన రెడ్ల రమాదేవి కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన దాతలు రెడ్ల రమాదేవి పేరిట నిత్యాన్నదానానికి రూ. 2,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు ఆలయ పర్యవేక్షకులు జగదీష్‌.. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

నిర్దేశిత గడువులో ‘స్పాట్‌’ పూర్తి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి. దేవానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని స్థానిక బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను ఆదివారం దేవానందరెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ఎంత మేర మూల్యాంకనం పూర్తైంది? ఇంకా ఎంత మేర ఉందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పాట్‌ వాల్యుయేషన్‌కు హాజరైన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగను దేవానందరెడ్డి పంపిణీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement