అన్నదాతకు ‘మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ‘మద్దతు’

Published Sat, Jun 22 2024 12:14 AM | Last Updated on Sat, Jun 22 2024 12:14 AM

అన్నద

●పలు పంటలకు కనీస మద్దతు ధర సవరించిన కేంద్రం ●వరిపై ఉన్న ధర రూ.117 పెంపు ●ఇప్పటికే రాష్ట్రం నుంచి రూ.500 బోనస్‌ ప్రకటన ●ఇంకొన్ని పంటలకు కూడా ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం ●అయినా పెరిగిన పెట్టుబడులతో గిట్టుబాటు కాదంటున్న రైతాంగం

ఖమ్మంవ్యవసాయం: ఏటేటా పంటల సాగు పెట్టుబడి పెరుగుతోంది. అయినా కష్టనష్టాలకోర్చి సాగు చేస్తున్న పంటలకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన ఏటా మాదిరిగానే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. దేశంలో పండించే 17 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను సవరించగా.. ఇవి ప్రస్తుత వానాకాలం నుంచే అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్నకు సైతం కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు వర్తించనున్నాయి. ఇవికాక పెసర, మినుము, కంది, మినుము వంటి పంటలను కూడా రైతులు సాగు చేస్తుండగా మద్దతు ధర పెరిగింది.

వరికి అ‘ధనమే’..

ఖమ్మం జిల్లాలో 7 లక్షలకు పైగా ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా రైతులు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. గత ఏడాది వరి గ్రేడ్‌–ఏ రకం క్వింటాకు రూ.2,203గా, సాధారణ రకానికి రూ.2,183గా ధర నిర్ణయించారు. ఈ ఏడాది వీటిపై రూ.117 పెంచడంతో గ్రేడ్‌–ఏ వరి రకం ధర రూ.2,320కు, సాధారణ రకం రూ.2,300కు చేరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయాన వరి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రైతులకు అదనంగా ఇది వర్తించనుంది. అయితే, గత ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ధాన్యానికి డిమాండ్‌ పెరిగింది. దీంతో ప్రభుత్వ మద్దతు ధర కన్నా ప్రైవేట్‌ వ్యాపారులు రకాల ఆధారంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించారు.

పత్తి క్వింటాకు రూ.7,521

ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన ధర లేక ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం కొంత మేరకు తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది పత్తికి కేంద్రం తేమ శాతం ఆధారంగా రూ.7,020 గరిష్ట ధర ప్రకటించగా.. ఈ ఏడాది మరో రూ.521 పెంచడంతో రూ.7,521కి చేరింది. జిల్లాలో 2022–23 సంవత్సరంలో పత్తి క్వింటాకు రూ.13 వేల వరకు ధర పలికినా ఆ తర్వాత రూ.10 వేల వరకు పడిపోయింది. గత ఏడాది సీజన్‌లో నాణ్యమైన పత్తికి రూ.6 వేలకు మించి దక్కలేదు. దీంతో ప్రభుత్వం సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి లేక రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యాన కేంద్రం క్వింటాకు రూ.501 ధర పెంచినా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు.

పెరిగిన ఎరువుల ధరలు

ఎరువుల ధరలకు తోడు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగాయి. కాంప్లెక్స్‌ ఎరువులు గతంలో రూ.1,300 ఉంటే ఇప్పుడు రూ.1,900కు చేరాయి. గతంలో రూ.900కు లభించిన పొటాష్‌ ధర రూ.1,650కు, డీఏపీ ధర రూ.1,350కు చేరింది. ఫలితంగా పంట సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు, పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భూమికి కౌలు చెల్లింపుతో పాటు, పెట్టుబడులు పెట్టాల్సి ఉండడంతో అంతగా మిగిలేదేమీ ఉండదని వారు వాపోతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో)

పంట ఖమ్మం భద్రాద్రి

జిల్లా కొత్తగూడెం

వరి 2,83,983 1,71,196

పత్తి 2,01,834 1,75,619

మొక్కజొన్న 40,000 60,254

పెసర 15,357 155

మినుము 436 205

వేరుశనగ 270 2,083

కంది 1,005 15,122

పంటల వారీగా పెరిగిన మద్దతు ధర (రూ.ల్లో)

పంట గత ఏడాది ఈ ఏడాది పెంపు

వరి గ్రేడ్‌–ఏ 2,203 2,320 117

సాధారణ రకం 2,183 2,300 117

పత్తి 7,020 7,521 501

మొక్కజొన్న 2,090 2,225 135

కందులు 7,000 7,550 550

పెసలు 8,558 8,682 124

మినుములు 6,950 7,400 450

వేరుశనగ 6,377 6,783 406

No comments yet. Be the first to comment!
Add a comment
అన్నదాతకు ‘మద్దతు’
1/1

అన్నదాతకు ‘మద్దతు’

Advertisement
Advertisement
 
Advertisement