రోడ్డెక్కని ఫుడ్‌ సేఫ్టీ వాహనం | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని ఫుడ్‌ సేఫ్టీ వాహనం

Published Sat, Jun 22 2024 12:12 AM | Last Updated on Sat, Jun 22 2024 12:12 AM

రోడ్డ

రోడ్డెక్కని ఫుడ్‌ సేఫ్టీ వాహనం

● అక్కడికక్కడే నాణ్యత పరీక్షించేందుకు వీలు ● ఐదు జిల్లాలకు కలిపి కేటాయించిన కేంద్రప్రభుత్వం ● సిబ్బంది సైతం ఉన్నా వినియోగించని అధికారులు ● జిల్లాల్లో కల్తీ ఆహారంపై కొరవడుతున్న నియంత్రణ

ఖమ్మంమయూరిసెంటర్‌: తీరిక లేని జీవన విధానంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. అంతేకాక సమయం చిక్కకపోవడంతో ఇంటి భోజనం కంటే బయట తయారుచేసిన ఆహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయాన ప్రజల బలహీనతను హోటళ్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులు నాణ్యత లేని, నిల్వ ఉంచిన భోజనం, ఆహార పదార్థాలు, తినుబండారాలను అందిస్తూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఖమ్మం, భద్రాచలంతదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో హోటళ్ల నిర్వాహకులు బండారం బయటపడింది. అయితే, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఆహారం నాణ్యతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సమకూర్చిన ‘ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌’ వాహనాన్ని మాత్రం అధికారులు కలెక్టరేట్‌ నుండి బయటకు తీయడం లేదు. నాలుగు నెలలుగా కలెక్టరేట్‌ ఆవరణలోనే వాహనాన్ని నిలిపి.. అది పాడవుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కల్తీని కనిపెట్టేలా..

కల్తీ ఆహారంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందినా, అధికారులకు సమాచారం వచ్చినా అక్కడికక్కడే తనిఖీ చేసి నాణ్యతను తేల్చేలా కేంద్ర ప్రభుత్వం మైక్రో బయాలజీ ల్యాబ్‌ యూనిట్‌ మొబైల్‌ వాహనాన్ని అందజేసింది. రూ.1.50 కోట్ల విలువైన ఈ వాహనంలో టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు వ్యాపారులకు తక్షణ సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ జారీకి కావాల్సిన పరికరాలు, కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్లు, పిక్చర్‌ వాల్స్‌ కూడా పొందుపర్చారు. ఈ వాహనంలో జనరేటర్‌, సేకరించిన శ్యాంపిళ్లు చెడిపోకుండా ఆధునిక పరికరాలు, ఏసీలను సైతం ఏర్పాటు చేశారు. ఈ వాహనం ద్వారా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉండగా.. ఇన్ని జిల్లాల మాటేమో కానీ ఖమ్మం కలెక్టరేట్‌ నుండి సైతం బయటకు తీయకపోవడం గమనార్హం.

కొరవడుతున్న పర్యవేక్షణ..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, బేకరీలు, కార్ఖానాలు ఉన్నాయి. వీటిని నిరంతరం తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారులు, సిబ్బంది కొరతతో అలా జరగడంలేదు. ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో నిల్వ ఉన్న మాంసం, పాచిపోయిన ఆహారం, బూజుపట్టిన ఐస్‌క్రీమ్‌లు బయటపడగా.. మిగిలిన వాటిల్లో పరిస్థితి ఎలా ఉందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్ఖానాల్లో రోజుల తరబడి ఉపయోగించిన నూనెలోనే పిండి వంటలు చేస్తన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం వీటిని తనిఖీ చేసి నిర్వహణ సక్రమంగా చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ఫిర్యాదు అందినప్పుడే తనిఖీ చేయడం, నోటీసులతో సరిపెడుతుండడంతో హోటళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

తూతూ మంత్రంగానే..

జిల్లాలో ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పరీక్షలు చేయడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. అడపాదడపా తనిఖీలు చేస్తున్నా ప్రజలకు అవగాహన కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాన్ని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు 2022 జూలై నెలలో కేంద్రం కేటాయించింది. తొలినాళ్లలో డ్రైవర్‌, టెక్నీషియన్‌, సిబ్బంది లేరంటూ మూలనపెట్టారు. ఆతర్వాత కలెక్టర్‌ చొరవతో టెక్నీషియన్‌, డ్రైవర్‌, అటెండర్‌ను ఇచ్చినా పూర్తి స్థాయిలో వాహనాన్ని వినియోగించడం లేదు. గతేడాది నామమాత్రంగా ఖమ్మంలో అక్కడక్కడా వాహనం తిప్పి ప్రజల్లో కల్తీ ఆహారంపై అవగాహన కల్పించినట్లు చెబుతున్న పూర్తి స్థాయిలో మాత్రం అప్పుడు, ఇప్పడూ జరగడం లేదు.

ఇక నుండి పరీక్షలు, అవగాహన

స్కూళ్ల, హాస్టళ్ల సెలవులు ఉండడంతో ఇన్నాళ్లు మొబైల్‌ వాహనాన్ని వినియోగించలేదు. ఇటీవల పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యాన ఇక నుండి ఈ వాహనం ద్వారా ఆహార తనిఖీ పరీక్షలు ముమ్మరం చేస్తాం. అంతేకాక ప్రజలకు అవగాహన సైతం కల్పించనున్నాం.

– ఆర్‌.కిరణ్‌కుమార్‌, జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డెక్కని ఫుడ్‌ సేఫ్టీ వాహనం1
1/1

రోడ్డెక్కని ఫుడ్‌ సేఫ్టీ వాహనం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement