మూడు తరాలు సివిల్‌ సర్వీసెస్‌లోనే... | - | Sakshi
Sakshi News home page

మూడు తరాలు సివిల్‌ సర్వీసెస్‌లోనే...

Published Sat, Jun 22 2024 12:10 AM | Last Updated on Sat, Jun 22 2024 12:10 AM

-

● ప్రజాసేవలోనే మరెక్కడా దక్కని సంతృప్తి ● విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యాతాంశాలు ● ‘ధరణి’పై సహాయ కేంద్రాలు, క్షేత్రస్థాయికి గ్రీవెన్స్‌ ● కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

మూడు తరాలుగా ప్రజాసేవలోనే..

మా కుటుంబం మూడు తరాలుగా పబ్లిక్‌ సర్వీసెస్‌లోనే ఉంది. అంతకు ముందు బ్రిటీష్‌ హయాంలో మా తాత గారి నాన్న గ్రామంలో పోలీస్‌గా కొనసాగారట. మా కుటుంబంలో ముందు నుంచి ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉంది. తాత అబ్దుల్‌ కరీంఖాన్‌ 1958లో గ్రూప్‌–1 నుంచి ఐఏఎస్‌కు ఎంపికై 1988లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రిటైర్‌ అయ్యారు. ఆతర్వాత ఏడాదే నేను పుట్టాను. ఇక మా నాన్న, 1981 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అబ్దుల్‌ ఖయ్యూంఖాన్‌(ఏ.కే.ఖాన్‌) 2016లో ఏసీబీ డీజీగా రిటైర్‌ అయ్యారు. అదే ఏడాది నేను ఐఏఎస్‌కు సెలక్ట్‌ అయ్యా. వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేటల్లో వివిధ హోదాల్లో పనిచేశాక పెద్దపల్లిలో కలెక్టర్‌గా పనిచేస్తూ ఖమ్మం వచ్చా.

ఆసక్తితోనే..

కొన్ని ప్రయోగాలు చేశాకే మనకు ఏది బెస్ట్‌ అనేది తెలుస్తుంది. నేను ఐఏఎస్‌కు ఎవరి ఒత్తిడితోనూ సిద్ధంకాలేదు. ఇది సులువేం కాదని తెలిసినా ఆసక్తితో ఎంచుకున్నా. ప్రైవేట్‌ రంగంలో ఏదో చేయాలనే ఆసక్తి, ప్రేమ ఉన్నా అవకాశాలు లభించవు. అదే ఐఏఎస్‌గా అయితే క్షేత్రస్థాయిలో చేసింది చూపించొచ్చు.. పది మందికి మద్దతుగా నిలవొచ్చు. ఈ ఆలోచనతోనే మా కుటుంబం తరతరాలుగా ఈ రంగాన్ని ఎంచుకుంటోంది.

పదేళ్లలో 12 స్కూళ్లు!

హైదరాబాద్‌కు చెందిన మా కుటుంబం నాన్న ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో నేనూ పదేళ్లలో 12 స్కూళ్లు మారా. 11, 12వ తరగతులు రామయ్య ఐఐటీ అకాడమీలో పూర్తిచేశాక రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివా. ఆపై రెండున్నరేళ్లు ప్రైవేట్‌ రంగంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించి రైల్వే ఉద్యోగంలో చేరా. అనంతరం 2016లో ఐఏఎస్‌కి ఎంపికయ్యా. నా సతీమణి హమ్న మరియమ్‌ కూడా ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్నారు. ఫ్రాన్స్‌, జెద్దాలో పనిచేశాక ప్రస్తుతం ఢిల్లీలో యునైటెడ్‌ నేషన్‌ పొలిటికల్‌ డెస్క్‌ చూస్తున్నారు.

అవగాహన కోసం హెల్ప్‌డెస్క్‌

భూసమస్యల పరిష్కారంలో భాగంగా ధరణి సమస్యల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే కలెక్టరేట్‌లో ప్రారంభించగా.. ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేయిస్తాం. ధరణి దరఖాస్తు సమయాన చాలామందికి అవగాహన లేక ఇబ్బంది పడుతుండడమే కాక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై అవగాహన కల్పించేలా సహాయ కేంద్రాల్లో సిబ్బంది సహకరిస్తారు. ఒకవేళ తిరస్కరించినా అందుకు కారణాలను తెలియజేస్తాం.

క్షేత్రస్థాయికి గ్రీవెన్స్‌

ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ కు ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి వినతులు ఇస్తున్నారు. అందుకే గ్రీవెన్స్‌ను ప్రజల వద్దకే తీసుకెళ్లేలా ఓ వారం కలెక్టరేట్‌లో.. ఆతర్వాత నియోజకవర్గానికి ఒక రోజు.. అనంతరం మండలస్థాయిలో నిర్వహిస్తాం. ధరణి వంటి సమస్యలు తహసీల్దార్‌ స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉన్నందున మండలాల్లో నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. తద్వారా కలెక్టరేట్‌కు రావాల్సిన ఇక్కట్లు తప్పుతాయి. అంతేకాక గ్రీవెన్స్‌ల్లో సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది.

పాఠశాలల్లో స్పోర్ట్స్‌ పీరియడ్‌

పాఠశాలలను సందర్శించిన సమయాన ప్రతిరోజు స్పోర్ట్స్‌, లైబ్రరీ పీరియడ్‌ నిర్వహించాలని సూచించా. విద్యావ్యవస్థలో ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఫలితాలు రాబట్టుకోవాలి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకునేందుకు క్యూ ఉండడంతో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పా. ఇలాంటి చిన్నచిన్న మార్పులు చేస్తూ వెళ్తే ప్రజలకు మెరుగైన సేవలందుతాయి.

ప్రగతిపథంలో జిల్లా..

ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే ఖమ్మం విద్యాపరంగా ముందంజలో ఉంది. ఇక్కడి ప్రజ లకు ఉన్న ఆకాంక్షల మేరకు జిల్లాను అభివృద్ధిలో ముందుకెలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నా. మాది పోలీస్‌ కుటుంబం కావడం వల్లనేమో క్షేత్రస్థాయిలో పరిశీలించడం అలవాటు. అందుకే రాగానే పాఠశాలలు, వైద్యశాలలు పరిశీలించా. ఇక్కడి రైతులతో మాట్లాడినప్పుడు ఏ పంట వేస్తున్నాం.. ఎంత దిగుబడి వస్తుందనే తదితర అంశాలు పూర్తి అవగాహనతో చెప్పారు. వీరందరి ఆకాంక్షల మేరకు పనిచేయడం నాకు చాలెంజే. అన్నీ పరిశీలించి స్పష్టత వచ్చాక దాని ఆధారంగా ముందుకెళ్తా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement