జోరుగా రాయ‘బేరాలు’! | Sakshi
Sakshi News home page

జోరుగా రాయ‘బేరాలు’!

Published Mon, Nov 20 2023 12:06 AM

- - Sakshi

అసంతృప్తులకు వల విసురుతున్న పార్టీలు
● ఇతరులను చేర్చుకునేందుకు ప్రత్యేక కమిటీలు ● కండువాలు మార్చేస్తున్న నేతలు, కార్యకర్తలు

ఇల్లెందురూరల్‌: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా రాయ‘బేరాలు’ ముమ్మరం అవుతున్నాయి. అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రక్రియ ఓ వైపు కొనసాగిస్తూనే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేసి మరీ జంపింగ్‌లను ప్రోత్సహిస్తుండటంతో ఎవరు.. ఏ పూట.. ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

అసంతృప్తులపై నజర్‌..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలను లెక్కలేస్తున్నాయి. తమ పార్టీ బలాన్ని చూపించడానికి ప్రత్యర్థి పార్టీ నుంచి తమవైపు ఆకర్షితులయ్యే వారు ఎవరైనా ఉన్నారా అంటూ వెదుకులాడుతున్నాయి. ఇందుకోసం వారి స్థాయిని, హోదాను బట్టి డబ్బు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా పార్టీల్లో టికెట్‌ దక్కని అసంతృప్తుల వైపు ప్రత్యర్థి పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని, లేదంటే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తున్నాయి. ఇలా అన్ని పార్టీలూ జంపింగ్‌లను ప్రోత్సహిస్తుండటంతో వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలు, కార్యకర్తలు పక్క చూపులు చూస్తున్నారు. దీంతో కండువాలు మారడం చకచకా జరిగిపోతోంది.

ప్రజాప్రతినిధుల వలసల జోరు..

సాధారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అప్పటివరకు తాము కొనసాగిన పార్టీ విజయం కోసం ఎన్నికల సమయంలో శ్రమించడం సహజం. కానీ తాజా ఎన్నికల సమయంలో సాధారణ కార్యకర్తలు, నాయకుల కంటే ప్రజాప్రతినిధుల వలసలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కండువాలను సులువుగా మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పార్టీలు వలస వచ్చే ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ప్యాకేజీలు కట్టబెడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు జంపింగ్‌లు సర్వసాధారణంగా మారుతున్నాయి.

ఎప్పుడే కండువాతో కనిపిస్తారో..

ప్రత్యేక కమిటీల ద్వారా ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న అభ్యర్థులు అంతే స్థాయిలో ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కొంత అంగబలం ఉన్న నేతలను గుర్తించి.. తగిన హామీలిస్తూ తిరిగి సొంత గూటికి తీసుకొస్తున్నారు. దీంతో కొందరు నేతలు ఉదయం ఒక కండువాతో, సాయంత్రం మరో కండువాతో దర్శనమిస్తున్నారు.

అభ్యర్థులపై దృష్టి

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, నియోజకవర్గ స్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకులను తమపార్టీలోకి చేర్చుకుంటూ వలసలను ప్రోత్సహిస్తుండగా ఆయా పార్టీల అగ్రనాయకత్వాలు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన నేతలపై దృష్టి సారిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకుల్లో కొందరు వలసలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంతకాలం తాము నమ్ముకున్న పార్టీ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ మారితే భవిష్యత్‌లో మంచి అవకాశం రాకపోతుందా అనే ఆశతో మరి కొందరు నిర్ణయం తీసుకుంటున్నారు.

లాభనష్టాలు షరామామూలే..

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్న నాయకులకు అది కూడా తలనొప్పిగానే మారుతోంది. అప్పటివరకు పార్టీనే నమ్ముకొని పనిచేసిన తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం తమపై ఏంటని పలువురు నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో వారిని సముదాయించడం నాయకత్వానికి సమస్యగా మారుతోంది. ఏదేమైనా తాజా వలసలు పార్టీలకు ఎంత మేర మేలు చేస్తాయో, ఏ మేరకు నష్టపరుస్తాయోనని అభ్యర్థులు భయపడుతుండగా లాభనష్టాలు షరా మామూలేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement