బాలారిష్టాలు దాటని హబ్‌ | Sakshi
Sakshi News home page

బాలారిష్టాలు దాటని హబ్‌

Published Tue, Apr 23 2024 8:20 AM

పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్‌ హబ్‌ - Sakshi

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్‌ హబ్‌లో రకరకాల కొరతతో తరచూ పరీక్షలు నిలిచిపోతున్నాయి. రసాయనాల కొరత, యంత్రాల్లో లోపాలతో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో సిబ్బందికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లు తీసుకొస్తున్నా లక్ష్యం మేరకు పరీక్షలు జరగడం లేదు. ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌ నెలకొల్పారు. తొలుత 57 రకాల పరీక్షలు నిర్వహించగా క్రమంగా వాటి సంఖ్య పెంచడంతో ప్రస్తుతం 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ కొంత కాలంగా టెస్టులకు రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్ని పరీక్షలు జరగడం లేదు. ఇటీవల రసాయనాల సరఫరా పూర్తిగా నిలిచిపోగా కొన్ని రోజుల పాటు పరీక్షలే నిలిచిపోయాయి. దీంతో అధికారులు మహబూబాబాద్‌, వరంగల్‌ ఆస్పత్రుల నుంచిరసాయనాలు తెప్పించి పని కానిచ్చేశారు. ఇదే పరిస్థితి తరచుగా ఎదురవుతుండడంతో అవసరమైన పరీక్షలు జరగక సామాన్యులు మళ్లీ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

తొలినాళ్లలో మంచి స్పందన

డయాగ్నస్టిక్‌ హబ్‌కు తొలి నాళ్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం అదనంగా మరో 77 రకాల పరీక్షలను గత ఏడాది ప్రభుత్వం చేర్చింది. ఇలా 134రకాల పరీక్షలు చేయాల్సి ఉన్నా ఖమ్మం హబ్‌లో సగానికి కంటే తక్కువ పరీక్షలే జరుగుతున్నాయి. తరచూ రసాయనాల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, యంత్రాల మరమ్మతులు వంటి కారణాలతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా హబ్‌లో ప్రతీ గంటకు 1,520 పరీక్షలు చేస్తారు. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్‌ మిషన్‌ ద్వారా 1,200, ఇమ్యునో అనలైజర్‌ మిషన్‌ ద్వారా 220, సీబీపీ మిషన్‌ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ స్థాయిలో జరగడంలేదు.

45 ఆస్పత్రుల నుండి శాంపిళ్లు

జిల్లాలోని 45 ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఖమ్మం పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్‌ హబ్‌కు నిత్యం శాంపిల్స్‌ వస్తుంటాయి. పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో సేకరించిన శాంపిళ్లను వాహనాల్లో ఇక్కడకు తీసుకొస్తారు. ఇందుకోసం ఐదు రూట్లలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతరం హబ్‌లో పరీక్షలు చేసి 24గంటల్లోగా బాధ్యుల సెల్‌ఫోన్‌కు రిపోర్టు పంపిస్తారు. కానీ కొంత కాలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగకపోగా... అవసరమైన వారు ప్రైవేట్‌ సెంటర్లను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రస్తుతం హబ్‌లో సీబీపీ, గర్భిణులకు నిర్వహించే కోయోగ్లేషన్‌ టెస్టులు, ఇతర అవసరమైన టెస్టులు అందుబాటులో లేవని సమాచారం.

అన్ని పరీక్షలు జరిగేలా చర్యలు

డయాగ్నస్టిక్‌ హబ్‌లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రసాయనాల కొరతతో అప్పుడప్పుడు కొంత ఏర్పడుతుండడంతో ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హబ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా చూస్తున్నాం.

డాక్టర్‌ బి.అమర్‌సింగ్‌, ఆర్‌ఎంఓ,

ఖమ్మం జనరల్‌ ఆస్పత్రి

తరచుగా పరీక్షలకు అంతరాయాలు

పేరుకు 134 పరీక్షలు.. అందేవి అంతంతే

ఖమ్మం డయాగ్నస్టిక్‌ హబ్‌లో రసాయనాల లేమితో ఇక్కట్లు

సిబ్బంది కొరత, యంత్రాల మరమ్మతులతో ఇంకొంత సమస్య

1/1

Advertisement
Advertisement