కిడ్నాప్‌ కథ సుఖాంతం | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కథ సుఖాంతం

Published Fri, Nov 10 2023 5:14 AM

- - Sakshi

చింతామణి: ఇటీవల తాలూకాలోని మురగమల్లా అమ్మాజాన్‌ బావాజాన్‌ దర్గాలో కిడ్నాప్‌ అయిన బాలున్ని గురువారం కంచార్లపల్లి పోలీసులు గాలించి పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు హుబ్లీలో ఉన్నట్లు తెలిసి క్షేమంగా తీసుకొచ్చారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. బెంగళూరుకు చెందిన కుటుంబం నాలుగు రోజుల కిందట దర్గా దర్శనానికి రాగా, బాలున్ని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. హుబ్లీలో కిడ్నాపర్‌ను గుర్తించి చిన్నారిని కాపాడారు.

ప్రముఖుల వేడుకలో చోరీ

శివాజీనగర: ఇటీవల రోజుల్లో బెంగళూరులో దొంగతనం కేసులు అధికమయ్యాయి. పట్టపగలే బంగారు షాపుల్లోకి దుండగులు చొరబడి పెద్దమొత్తంలో బంగారం, నగదును దోచుకెళ్లారు. ఏకంగా గవర్నర్‌ పాల్గొన్న ఓ కార్యక్రమంలో దొంగలు పడడం గమనార్హం. ఇటీవల బెంగళూరులోని ఓ హోటల్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా, గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పాల్గొన్నారు. భారీగా పోలీసు భద్రతను కల్పించారు. ఆహ్వానితులు తప్ప ఇతరులు రావడానికి వీలు లేకుండా చూశారు. ఇంత భద్రత ఉన్నా కూడా ఒక మహిళ వజ్రపు కమ్మలు, నగదు మాయమైంది. అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అంజిత అనే మహిళ పర్స్‌ను దొంగలు కొట్టేశారు. ఇందులో ఖరీదైన వజ్రపు కమ్మలు, రూ.10 వేలు నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదైనట్లు తెలిసింది.

రౌడీషీటర్‌ దారుణ హత్య

బనశంకరి: రౌడీషీటర్‌ సహదేవ్‌ను మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి చుంచుఘట్ట మెయిన్‌రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలు... కోణణకుంటే పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌ జాబితాలో ఉన్న సహదేవ్‌ (32) బుధవారం రాత్రి 9.30 సమయంలో చుంచుఘట్ట మెయిన్‌రోడ్డులోని బేకరి వద్దకు టీ తాగడానికి వచ్చాడు. ఆ సమయంలో మూడు బైకుల్లో వచ్చిన ఆరుగురు మారణాయుధాలతో సహదేవ్‌పై విచక్షణారహితంగా దాడిచేసి క్షణాల్లో ఉడాయించారు. తీవ్రగాయాతో సహదేవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ రాహుల్‌కుమార్‌ శహపురవాడ దుండగుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాతకక్షలతో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఉత్సాహంగా రథోత్సవం

తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న సత్యమంగళలో ఏకాదశి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం గురువారం ఘనంగా జరిగింది. పాలికే ఉప మేయర్‌ టి.కే.నరసింహ మూర్తి ప్రారంభించారు. స్థానిక యువత, ప్రజలు పాల్గొన్నారు.

కార్మికుల పిల్లలు విద్యకు దూరం కారాదు : సీఎం

బనశంకరి: కార్మికుల పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో బాంక్వెట్‌ హాల్లో కార్మిక శాఖ ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు 2022–23 విద్యా సంవత్సర సహాయధనం వితరణ కార్యక్రమాన్ని సీఎం సిద్దరామయ్య ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 9,60 లక్షల మంది కార్మికుల పిల్లలు ఉన్నారని, వారికి రూ. 226 కోట్ల విద్య సంక్షేమ నిధిని విడుదల చేస్తామన్నారు. అసమానతలు తొలగించే ఉద్దేశంతో తమ ప్రభుత్వం 9.60 లక్షల మందికి సహాయ నిధిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించే వారిని దూరంగా పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌, మంత్రులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూంకు

సింహాసనం

మైసూరు: దసరా సంబరాల్లో అంబావిలాస్‌ ప్యాలెస్‌లో ప్రైవేట్‌ దర్బార్‌ కోసం తీసుకువచ్చిన వజ్రఖచిత బంగారు సింహాసనాన్ని మళ్లీ స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. నవరాత్రుల్లో రాజవంశీకుడు యదువీర్‌ ఒడెయార్‌ ఈ సింహాసనంపై ఆసీనులై దర్బార్‌ జరిపారు. గురువారం అర్చకులు, సిబ్బంది సంప్రదాయరీతిలో పూజలు చేసి సింహాసనాన్ని విడదీశారు. 6 విడి భాగాలను భారీ భద్రత మధ్య ప్యాలెస్‌లో నేలమాళిగలో ఉన్న స్ట్రాంగ్‌ రూంలోకి తరలించి భద్రపరచి సీల్‌ వేశారు.

బాలున్ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న దృశ్యం
1/1

బాలున్ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న దృశ్యం

Advertisement
Advertisement