కాసుల కోసం తనిఖీలు | Sakshi
Sakshi News home page

కాసుల కోసం తనిఖీలు

Published Sat, May 25 2024 12:10 AM

కాసుల కోసం తనిఖీలు

కోరుట్ల: రెండు రోజుల క్రితం.. కోరుట్ల సెగ్మెంట్‌లోని మూడు ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. కోరుట్ల పట్టణంలోని రెండు ఇళ్లు, మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో మరో ఇంటిలో పోలీసులు తనిఖీ చేయడం చర్చనీయంగా మారింది. ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బుల డంప్‌లు మిగిలి ఉన్నట్లుగా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా, మరోవైపు హవాలా డబ్బుల కోసం కావచ్చనే పుకార్లు జోరందుకున్నాయి. అయితే మూడు ఇళ్లల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదు.

సమాచారం ఆలస్యమా ?

పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు జోరుగా డబ్బులు పంపిణీ చేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో అప్పటి డబ్బులు అట్టపెట్టెల్లో ఉంచి దాచి ఉంచారన్న సమాచారం పోలీసులకు ఎన్నికలు ముగిసిన తర్వాత అందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతస్థాయి పోలీసు అధికారుల నుంచి అందిన సమాచారాన్ని ధ్రువీకరించే క్రమంలో పోలీసులు మూడు ఇళ్లల్లో ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి నగదు దొరకలేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించిన మూడు ఇళ్లల్లో ఒకటి కోరుట్లలోని సాయిరాంపురా కాలనీలో నివసించే కాంగ్రెస్‌ సేవాదళ్‌ నాయకునిది కాగా, మరొకటి కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ వెనకబాగంలో ఉండే వ్యక్తిది కావడం గమనార్హం. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో పోలీసులు తనిఖీలు చేసి ఇంటి యజమాని ఓ రైతుగా తెలిసింది. ఈ మూడు ఇళ్లల్లో డబ్బులు ఉన్నాయన్న సమాచారం తప్పు అని పోలీసుల తనిఖీల్లో తేలింది.

లెక్కలేని కాసుల మాట ఉత్తిదే..

పోలీసులు తనిఖీలు చేసిన ఇళ్లల్లో లెక్కలేని డబ్బులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. పోలీసులకు వచ్చే సాధారణ సమాచారంలో భాగంగా ఆయా ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బులు దొరకలేదు. ఓ ఇంట్లో ఒకటి, రెండు ప్రామిసరీ నోట్లు, మరో ఇంట్లో రూ.4వేలకు పైగా నగదు దొరకడంతో తమకు వచ్చిన సమాచారం తప్పు అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయమై కోరుట్ల సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ.. పోలీసులు తనిఖీల్లో డబ్బులు దొరికాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు.

ఎన్నికల డబ్బు పేరిట కలకలం

తప్పుడు సమాచారమా ?

తనిఖీల్లో దొరకని నగదు

Advertisement
 
Advertisement
 
Advertisement