బండి, గంగుల ఒక్కటే | Sakshi
Sakshi News home page

బండి, గంగుల ఒక్కటే

Published Sat, Apr 20 2024 1:45 AM

అంబేడ్కర్‌ గ్రౌండ్‌లో మాట్లాడుతున్న మంత్రి ప్రభాకర్‌ - Sakshi

వినోద్‌ను ఓడించింది వాళ్లే ఇద్దరూ కలిసే నగరాన్ని దోచుకున్నారు

తీగలవంతెనపై విచారణ జరుగుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఒక్కటేనని, ఇద్దరు కలిసి నగరాన్ని దోచుకున్నారని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. నగరంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం మంత్రి మార్నింగ్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉప్పు నిప్పులా ఉన్న గంగుల, బండి పాలు నీళ్లలా ఎందుకు కలిసిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి వినోద్‌కుమార్‌ను ఓడించారన్నారు. నగరంలో భూ కబ్జాలపై స్థానిక ఎంపీగా సంజయ్‌ ఎందుకు మాట్లాడడంలేదన్నారు. స్మార్ట్‌సిటీ, గ్రానైట్‌ అక్రమాలపై ప్రశ్నించాల్సిన ఎంపీ ఎందుకు మౌనంగా ఉన్నాడని, ఎంపీ విధానాలను నిలదీయాల్సిన ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎన్నిలకు ముందు సంజయ్‌ ఆస్కార్‌అవార్డు స్థాయిలో నటిస్తారని, ఒకసారి భార్య తాళి అమ్ముకున్నానని, మరోసారి ఎంఐఎం దాడి చేసిందని, ఇంకోసారి మూర్చవచ్చి పడిపోతాడన్నారు. నగరాన్ని లండన్‌ చేస్తాం, అద్ధంలా మారుస్తామని కేసీఆర్‌ చెప్పారని ఏమైందన్నారు. తీగలవంతెన నిర్మాణ అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు లోపలికి పోవుడేనన్నారు. తాము అధికారంలోకి రాగానే భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేసి చూపిస్తున్నామని, అదే కాంగ్రెస్‌ పాలన అని చెప్పారు. భూ కబ్జాల్లో ఎవరు జైలుకు వెళ్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఏ పార్టీ వాళ్లయినా భూ ఆక్రమణలకు పాల్పడితే వాపసు ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక నగరంలో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, వైద్యుల అంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement