జనావాసాల్లో సిలిం‘డర్‌’! | Sakshi
Sakshi News home page

జనావాసాల్లో సిలిం‘డర్‌’!

Published Thu, Apr 18 2024 10:00 AM

కోతిరాంపూర్‌లోని గోడౌన్‌లో సిలిండర్లను దించుతున్న సిబ్బంది - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజల ప్రాణాలతో చెలగాటమిది. ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి వ్యవహరిస్తుంటే నియంత్రించాల్సిన యంత్రాంగం ‘మామూలు’గా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుతుండగా సకలవర్గాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో 4లక్షల జనాభా జీవనం సాగిస్తుండగా నివాసాల మధ్యే గ్యాస్‌ ఏజెన్సీలు సిలిండర్‌ గోడౌన్లను నిర్వహించడం అత్యంత ప్రమాదకరం. పేలుడు జరిగితే ఊహించని విస్ఫోటనమే. 10వేలకు పైగా ఎక్స్‌ప్లో జివ్‌ కెపాసిటీ కాగా సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నివాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అంతా ఇష్టారాజ్యం

నగరంలో 11 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్‌పీ, భారత్‌, ఇండెన్‌ కంపెనీలు గ్యాస్‌ సరఫరా చేస్తున్నాయి. కంపెనీల కేంద్రాల నుంచి లారీల ద్వారా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా జరుగుతుండగా వాటిని ఆయా గ్యాస్‌ ఏజెన్సీలు గోడౌన్లలో దింపుకుని బుక్‌ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ బాయ్స్‌ ద్వారా సరఫరా చేయడం జరిగే ప్రక్రియ. కాగా సిలిండర్లతో వచ్చిన లారీలు నిబంధనల ప్రకారం గోడౌన్‌ గేట్‌ బయట నిలపాలి. అక్కడి నుంచి కార్మికులు గోడౌన్‌లోకి ఒక్కొక్కటిగా తీసుకెళ్లి భద్రపరచాలి. సదరు లోడ్‌ వాహనం ఖాళీ అయిన తర్వాత డెలివరీ బాయ్స్‌ ఆటోలను గేట్‌ బయటే నిలిపి గోడౌన్‌ నుంచి ఒక్కో గ్యాస్‌ బండను తెచ్చి ఆటోలో వేసుకోవాలి. ఇవీ నిబంధనలు కాగా.. హెచ్చు గ్యాస్‌ ఏజెన్సీలు వాటిని అటకెక్కించాయి. దర్జాగా ఏకంగా గోడౌన్లోకి భారీ లోడ్లతో వాహనాలు వెళుతుండగా అక్కడే ఆటోలో సిలిండర్లను లోడ్‌ చేస్తున్నారు. పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోగా కార్యాలయాల్లోనే అన్నీ సక్రమమని మామూలుగా వ్యవహరిస్తున్నారు. గ్యాస్‌ లీకేజీ, కార్మికులు పొగతాగడం, తదితర నిర్లక్ష్యం మూలంగా భారీ విధ్వంసం జరిగే అవకాశముంది. ఏ చిన్న లీకేజీ ఏర్పడిన ఊహించని నష్టం.. కాలనీలకుకాలనీలే శవాల దిబ్బగా మారే పరిస్థితి.

తనిఖీలు తూచ్‌

గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాలు ఇళ్ల మధ్య, గోడౌన్లు నివాసాలు లేని శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నది నిబంధన. కానీ అత్యధిక ఏజెన్సీల గోడౌన్లు నివాసాల్లో ఉండటం ఆందోళనకర పరిణామం. గోడౌన్‌కు పటిష్టమైన గోడ.. గేట్‌ ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దీనివల్ల నష్టాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది. అయితే, కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల్లో మినహా ఇవేవీ ఎక్కడా కనిపించవు. చుట్టూ బహుళ అంతస్తుల భవనాలుండగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతమైనా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన యంత్రాంగం కళ్లున్నా కబోదిలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణముందా, వ్యవహరిస్తున్నారా..ననేది అగ్నిమాపక శాఖ పర్యవేక్షించాల్సి ఉండగా, లైసెన్స్‌ రెనివల్‌ రెవెన్యూ శాఖ నిర్వహించాల్సి ఉండగా ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా, స్టాక్‌ ఎంత, ఎంత డెలివరీ అయిందనే కోణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఇంకా నివాసాల మధ్య గోడౌన్లు నిర్వహిస్తున్నారంటే అధికారులు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. గ్యాస్‌ ఏజెన్సీలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. తనిఖీలు చేసి చర్యలు చేపడతామని సంబంధిత శాఖల అధికారులు వివరించారు. అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా.. వేచిచూడాల్సిందే.

నిబంధనలను విస్మరిస్తున్న ఏజెన్సీలు

ఇళ్ల మధ్యే గోడౌన్లు

అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ

మామూళ్ల మత్తులో యంత్రాంగం

Advertisement

తప్పక చదవండి

Advertisement