Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిక

Published Wed, Apr 17 2024 1:35 AM

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 
కాంగ్రెస్‌లో చేరుతున్న వహాజొద్ద్దీన్‌ - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎంఐఎం మాజీ చీఫ్‌, సీనియర్‌ నేత సయ్యద్‌ వహాజొద్ద్దీన్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి వహాజొద్దిన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, నడిపెల్లి అశోక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

‘భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడిద్దాం’

కరీంనగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడిద్దామని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరి కోసం రాజ్యాంగం నిర్మించబడిందని, రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రతిఒక్కరికీ అవసరమేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రులు కొన్ని చోట్లలో బహిరంగంగా చెబుతున్నారని, భారత రాజ్యాంగం జోలికి వస్తే దేశంలో ఉన్న నిరుపేదలు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా తిరగపడతారని, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన సహించేది లేదని అన్నారు. భారత రాజ్యాంగం 150 కోట్ల ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు.

‘అవాస్తవాలు ప్రచారం చేస్తే వేటు’

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలపై అవాస్తవాలు ప్రచారం చేసే యువజన కాంగ్రెస్‌ శ్రేణులపై వేటు తప్పదని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. పార్టీ నాయకత్వం, అంతర్గత విషయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా, సోషల్‌ మీడియా ద్వారా అనుచితంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ట్రినిటి విద్యాసంస్థల హర్షం

కరీంనగర్‌: యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ట్రినిటి పూర్వ విద్యార్థి రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్‌ ఆల్‌ ఇండియా 27వ ర్యాంకు సాధించడంపై ట్రినిటి కళాశాల ఫౌండర్‌ చైర్మన్‌ దాసరి మనోహర్‌రెడ్డి, కళాశాల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డిలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

పనులు ప్రారంభించకుంటే ఆమరణ నిరాహార దీక్ష

చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి గ్రామాల మధ్య రూ.19 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులను వారం రోజుల్లో ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీజేపీ నాయకుడు, గ్రామ సొసైటీ అధ్యక్షులు మంద శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం చిగురుమామిడిలో మాట్లాడారు. డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కోటా నుంచి నిధులు మంజూరయ్యాయని, ఉన్న రోడ్డును తొలగించిన కాంట్రాక్టర్‌ కంకరపోసి వదిలివేశాడని, దీతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. దుమ్ముధూళితో వాహనదారులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం పట్టివేత

జమ్మికుంట: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని మంగళవారం కేసు నమోదు చేశామని టౌన్‌ సీఐ వరగంటి రవి తెలిపారు. పట్టణంలో కృష్ణాకాలనీలోని ఓ వ్యక్తి వద్ద రూ.4,300, ఎఫ్‌సీఐ సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.1,480, మండలంలోని సైదా బాద్‌ గ్రామానికి మరో వ్యక్తి వద్ద రూ.2,100 విలువ చేసే మద్యం పట్టుకున్నామని, బెల్టుషాపు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించామన్నారు.

Advertisement
Advertisement