ముహూర్తం కుదిరింది | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

కోలాహలంగా వైఎస్సార్‌ సీపీ

అభ్యర్థుల నామినేషన్లు

వేలాదిగా తరలివచ్చిన జనసందోహం

కాకినాడలో ఆకట్టుకున్న భారీ

ర్యాలీలు, గుర్రపు స్వారీలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ ర్యాలీలు.. డప్పు మోతలు.. గుర్రపు స్వారీలు.. జనసందోహంతో కిక్కిరిసిపోయిన రహదారులు.. కార్యకర్తలు, అభిమానుల కేరింతలు.. నామినేషన్ల ప్రక్రియ వేళ.. జిల్లాలో సోమవారం కనిపించిన సందడి వాతావరణం ఇది. నామినేషన్లకు మంచి ముహూర్తం కావడంతో.. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పిఠాపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు.. భారీగా తరలివచ్చిన జనసందోహంతో రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు వెళ్లి, నామినేషన్లు వేశారు. ఎటుచూసినా జనమే జనం అన్నట్టుగా ఈ కోలాహలం అట్టహాసంగా సాగింది. అధికార వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు సంప్రదాయంగా వస్తున్న సెంటిమెంట్‌ను అనుసరించి నామినేషన్లు దాఖలు చేశారు. కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ జెండాల రెపరెపలతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలు వేసింది.

● వైఎస్సార్‌ సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావుకు అందజేశారు. చంద్రశేఖరరెడ్డి సతీమణి మహాలక్ష్మి కూడా మరో సెట్‌ నామినేషన్‌ వేశారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం 10.49 గంటలకు ద్వారంపూడి నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత సాంబమూర్తి నగర్‌లోని వైభవ వేంకటేశ్వర ఆలయానికి వెళ్లిన ద్వారంపూడి దంపతులు స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఆనంద భారతి గ్రౌండ్స్‌ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం నగరంలో భారీ వాహన, బైక్‌ ర్యాలీతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు బయలుదేరారు. వారిపై అభిమానులు దారి పొడవునా క్రేన్ల పై నుంచి పూలవర్షం కురిపిస్తూ, కేరళ ఛెండా వాయిద్యాలు, డప్పుల మోత, గుర్రపు స్వారీలతో సందడి చేశారు. రాజీనామా చేసిన మహిళా వలంటీర్లు కోకిల రెస్టారెంట్‌ సమీపంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెంట రాగా యువత కేరింతలు కొడుతూ భారీ ర్యాలీతో నగరంలో సందడి చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

● కాకినాడ రూరల్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నామినేషన్‌ అట్టహాసంగా సాగింది. సెంటిమెంట్‌గా భావించే కాకినాడ వెంకట నగర్‌లోని పాత ఇంటి వద్దకు ఉదయం వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కాకినాడ రెండో డివిజన్‌ వైద్య నగర్‌లోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు సర్పవరం జంక్షన్‌ వరకూ భారీ ర్యాలీతో బయలుదేరారు. జనసందోహం వెంట రాగా రూరల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇట్ల కిషోర్‌కు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం కన్నబాబు బీసీ, ఎస్సీ, ఓసీల నుంచి ఒక్కొక్కరిని ప్రతిపాదకులుగా సంతకాలు తీసుకుని నామినేషన్‌ వేశారు. ఆయన వెంట తండ్రి సత్యనారాయణ ఉన్నారు.

● రాష్ట్రంలోనే హాట్‌ సీటుగా మారిన పిఠాపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ రెండు సెట్ల నామినేషన్లను పిఠాపు రం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి వద్ద దాఖలు చేశా రు. సెంటిమెంట్‌గా ఎరుపు రంగు చీర, పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకుని నామినేషన్‌ వేశారు. తొలుత క్యాంపు కార్యాలయంలో పూజ చేసుకుని, పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళుతూ మార్గం మధ్యలో జై గణేష్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పిఠాపురం వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ రోడ్డు మీదుగా ఆర్‌ఓ కార్యాలయం వరకూ సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నామినేషన్‌ ప్రక్రియ కోలాహలంగా సాగింది. కార్యక్రమంలో వంగా గీత భర్త విశ్వనాథ్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

● పెద్దాపురం టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ని మ్మకాయల చినరాజప్ప, తుని నుంచి ఆ పార్టీ అ భ్యర్థి యనమల దివ్య కూడా నామినేషన్లు వేశారు.

● నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు 5, రెండో రోజు 7, మూడో రోజు 6 నామినేషన్లు దా ఖలు కాగా, నాలుగో రోజైన సోమవారం జిల్లా లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 మంది, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నలుగురు కలిపి మొత్తం 18 మంది నామినేషన్లు వేశారు.

1/1

Advertisement
Advertisement