విరబూసిన ప్రతిభాసుమాలు | Sakshi
Sakshi News home page

విరబూసిన ప్రతిభాసుమాలు

Published Sun, Nov 26 2023 11:34 PM

- - Sakshi

రెండో రోజూ చిన్నారుల సందడి

ముగిసిన క్రియ పిల్లల పండగ

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): క్రియ స్వచ్ఛంద సంస్థ జేఎన్‌టీయూకే ఆవరణలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘క్రియ పిల్లల పండగ’ ఆదివారం ముగిసింది. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 350 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు వర్సిటీ ఆవరణలో సందడి చేశారు. విద్యార్థులకు జూనియర్‌, సబ్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘ఘల్లుఘల్లు జోడెడ్లబండి, వెంకీ మామ, కొండకోనల నడుమ, సంక్రాంతి వచ్చింది తుమ్మెద’ వంటి హుషారెత్తించే జానపద గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. పల్లె వాతావరణం కళ్లకు కట్టినట్టు అనిపించింది. కల్తీ పురుగు మందుల వాడకంతో రైతు నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడటం, కరోనా భూతం, ప్లాస్టిక్‌ వాడకంతో అనర్థాల వంటి సందేశాలతో ప్రదర్శించిన విచిత్రవేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రలేఖన పోటీలతో పాటు మట్టితో వివిధ ఆకృతులు, జంతువుల బొమ్మలు తయారు చేశారు. పోస్టర్‌ ప్రజెంటేషన్‌, కోలాటం, లఘు నాటికలు, దేవతామూర్తుల ప్రదర్శన, పాటలు, వీణా వాయిద్యం, కీబోర్డు, డ్రమ్స్‌ ఇలా 29 అంశాల్లో చిన్నారులకు ప్రదర్శన, పోటీలు నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో ఈ ప్రదర్శనను తిలకించడానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు దాదాపు 7 వేల మందికి పైగా హాజరవడంతో వలంటీర్లను ద్వారా ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వసతి సదుపాయం కల్పించారు.

క్రియ సేవలు అభినందనీయం

ముగింపు కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది సేవకులు కలిసి ఏర్పాటు చేసిన క్రియ స్వచ్ఛంద సంస్థ.. నేడు పది వసంతాలు పూర్తి చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు సాధించడం అభినందనీయమని అన్నారు. బహుమతులు ప్రధానం కాదని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వహణకు కృషి చేస్తున్న క్రియ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి

సంప్రదాయ వేషధారణలో చిన్నారులు

విచిత్ర వేషధారణలో పోటీకి వస్తున్న చిన్నారి 
జానపద కళాకారులుగా చిన్నారుల సందడి
1/2

విచిత్ర వేషధారణలో పోటీకి వస్తున్న చిన్నారి జానపద కళాకారులుగా చిన్నారుల సందడి

2/2

Advertisement
Advertisement