సైన్స్‌ కాంగ్రెస్‌లో కరప విద్యార్థినుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కాంగ్రెస్‌లో కరప విద్యార్థినుల ప్రతిభ

Published Mon, Nov 13 2023 11:38 PM

- - Sakshi

జిల్లాస్ధాయి ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక

కరప: బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలలో కరప హైస్కూలు విద్యార్ధినులు భళా అనిపించుకున్నారు. వారు ప్రదర్శించిన ప్రాజెక్టు ఉత్తమంగా ఎంపికై ంది. రాష్ట్రస్ధాయిలో జరిగే పోటీలకు వీరు రూపొందించిన ‘మానసిక పిల్లలు పుట్టుక కారణాలు, పరిష్కారం’ అనే ప్రాజెక్టు ఎంపికై ంది. ఈనెల 9, 10 తేదీలలో కాకినాడలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 260 ప్రాజెక్టులు ప్రదర్శించగా రాష్ట్రస్ధాయికి ఏడు ఎంపికయ్యాయి. అందులో కరప విద్యార్ధినులు రూపొందించిన ప్రాజెక్టు ఒకటి. గుంటూరులోని కేఎల్‌ యూనివర్సిటీలో ఈనెల 29, 30వ తేదీలలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు ఈ ప్రాజెక్టు ఎంపికై నట్టు గైడ్‌టీచర్‌ మడికి సుదర్శనబాబు, హెచ్‌ఎం యు.లీలామనోహర్‌లు సోమవారం తెలిపారు.

ప్రాజెక్టు రూపొందించిన విధానం

కరప జెడ్పీ ఉన్నతపాఠశాలలోని భవిత కేంద్రంలో ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు ఫిజియోథెరపీ చేయిస్తూ, ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వీరిని విద్యార్ధినులు రమ్యశ్రీ సత్యరత్నామణి, యశస్వి విజయదుర్గలు గమనించారు. వీరి గురించి సైన్స్‌ ఉపాధ్యాయుడు సుదర్శనబాబును ఆరా తీశారు. ఈ కోణంలో భవిత కేంద్రం నిర్వాహకులను, పీహెచ్‌సీ వైద్యులను సంప్రదించి మంచి ప్రాజెక్టు తయారుచేస్తే, బాగుంటుందని ఆయన సూచించారు. దీంతో ఆ విద్యార్థినులు కరప పీహెచ్‌సీ డాక్టర్‌ పి.ఆశ, భవితకేంద్రం ఫిజియోథెరపిస్ట్‌ మారుతి, స్పీచ్‌ థెరపిస్ట్‌ స్వాతి, టీచర్‌ మల్లేశ్వరులను కలిశారు. వారు తెలిపిన వివరాలు ఆధారంగా ప్రాజెక్టును రూపొందించారు. ఉపాధ్యాయుడు సుదర్శనబాబు మార్గదర్శిగా నిలిచారు. వీరు రూపొందించిన ప్రాజెక్టును జిల్లా సైన్స్‌ అధ్యక్షుడు వినీల్‌, కన్వీనర్‌ కేసరి శ్రీనివాస్‌ ఉత్తమప్రాజెక్టుగా ఎంపికచేశారు. విద్యార్ధినులను, గైడ్‌ను జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, వైఎస్‌ఎంపీపీ పాట్నీడి భీమేశ్వరరావు, సర్పచ్‌ సాదే ఆశాజ్యోతి, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, హెచ్‌ఎం యు.లీలామనోహర్‌ తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement