No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

నపర్తి సంస్థానం చివరి రాజుగా జనుంపల్లి రాజారామేశ్వర్‌రావు (1944 సంవత్సరం)లో పట్టాభిషిక్తుడయ్యారు. 21 ఏళ్ల వయసులో రాజ్యపాలన చేపట్టిన ఆయన నిజాం ప్రభువుకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించారు. 1947లో స్వాతంత్య్రం రావడంతో.. వనపర్తి సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసేందుకు రామేశ్వర్‌రావు అప్పటి ప్రధాని నెహ్రూతో ఒప్పందం చేసుకున్నారు. 1949లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌లో చేరి, పలు ఆఫ్రికన్‌ దేశాలలో భారత ప్రభుత్వానికి కమిషనర్‌గా పనిచేశారు. 1957లో దేశవ్యాప్తంగా జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 1962లో ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ఏర్పాటు చేశారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1967లో తిరిగి మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి మూడోసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అనంతరం 1972, 1977లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 1977లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైనా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 42 పార్లమెంట్‌ స్థానాల్లో 40 స్థానాలు కాంగ్రెస్‌ గెలిచింది. అందులో మహబూబ్‌నగర్‌ ఎంపీగా రాజా రామేశ్వర్‌రావు విజయకేతనం ఎగురవేశారు. 1977లో కేంద్రంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం మూడేళ్లకే పడిపోవడంతో 1980లో మద్యంతర ఎన్నికలు వచ్చాయి. నాడు ఇందిరా కాంగ్రెస్‌గా పార్టీని వేరుచేసిన ఇందిరాగాంధీ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాగా.. ఐదుసార్లు వరుసగా గెలుస్తున్న రామేశ్వర్‌రావుపై పోటీచేయడం ఎందుకని మెదక్‌ సిట్టింగ్‌ ఎంపీ మల్లికార్జున్‌గౌడ్‌ను పాలమూరులో పోటీకి నిలబెట్టి.. ఆమె మెదక్‌లో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో రామేశ్వర్‌రావుపై మల్లికార్జున్‌ సంచలన విజయం సాధించారు.

Advertisement
Advertisement