Sakshi News home page

పత్తి కొనుగోళ్లు షురూ

Published Thu, Nov 16 2023 1:34 AM

కేటీదొడ్డిలో ఇంటి ఆవరణలో పత్తి ఆరబెట్టిన రైతు 
 - Sakshi

దళారులకు విక్రయించొద్దు ..

పత్తి పంటను రైతులు దళారులకు విక్రయించవద్దు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని తీసుకొచ్చి, సీసీఐ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందండి. ఇప్పటికే అలంపూర్‌లో కేంద్రాన్ని ప్రారంభించాము. గద్వాలలో మరో రెండు రోజుల్లో కేంద్రాన్ని ప్రారంభిస్తాం.

– పుష్ప,

జిల్లా మార్కెటింగ్‌ అధికారి

ఇప్పటికే అలంపూర్‌లో

ప్రారంభమైన కేంద్రం

మరో రెండు రోజుల్లో గద్వాలలో..

ఏ గ్రేడ్‌కు రూ.7,020, బీ గ్రేడ్‌కు రూ.6,620 ధర

బయటి మార్కెట్‌లో అధిక ధరలు..

అటు వైపే రైతుల మొగ్గు

జిల్లాలో 1.46లక్షల

ఎకరాల్లో పత్తి సాగు

గద్వాల వ్యవసాయం: ఈఏడాది వానాకాలం సీజన్‌ పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ మద్దతు ధరతో సీసీఐ ఆద్వర్యంలో జిల్లాలో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలంపూర్‌లో మూడు రోజుల క్రితం ప్రారంభం కాగా, గద్వాలలో మరో రెండు రోజుల్లో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా బయటి మార్కెట్‌లో పత్తికి ధరలు ఎక్కువగా వస్తున్నాయి. ఈకారణంతో రైతులు సీసీఐ కేంద్రాలకు వెళ్లి విక్రయించే పరిస్థితి కన్పించడం లేదు.

తగ్గిన సాగు..

పడిపోయిన దిగుబడి

నడిగడ్డలో గడిచిన పదేళ్ల నుంచి అప్పులు చేసైనా సరే పత్తిని ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో సైతం 2.30లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఈసారి 1.46లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యింది. సీజన్‌ ఆరంభానికి ముందే మే నెలలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. అయితే తీవ్ర ఉష్ణోగ్రతలకు తోడు, జూన్‌లో వర్షాలు లేకపోవడం వల్ల పంట ఎర్రతెగుళ్ళు, ఇతర తెగుళ్ళు సోకి పంటను తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీసివేసి మళ్లీ వేయాలనుకున్నప్పట్టికి వర్షాభావ పరిస్థితుల వల్ల వేయలేకపోయారు. ఇక జులైలో ఓ పది రోజుల పాటు మాత్రమే వర్షాలు విస్తారంగా కురిసాయి. ఆ తర్వాత వాన జాడ లేకుండా పోయింది. దీంతో చాలా మంది రైతులు పత్తి పంటను సాగు చేయలేకపోయారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది పత్తి అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. సాగు చేసిన పత్తి పంట ఉత్పత్తి పలు చోట్ల చేతికి వస్తోంది. ఈక్రమంలో చేతికి వస్తున్న పంట దిగుబడులు చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే ఈసారి 5నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పత్తి పంటకు అగ్గి, ఎర్ర తెగుళ్ళు ఆశించడం, అధిక ఉష్ణోగ్రతలు ఇలాంటి కారణాల వల్ల పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. మొత్తంమీద కేవలం 8767.68 మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.

కొనుగోలు

కేంద్రాలు

పండించిన పత్తిని ఇప్పటికే రైతులు పలు చోట్ల తీస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు పత్తిని కొనుగోలు చేసేందుకు గడిచిన నెల నుంచే ఏర్పాట్లు ఆరంభించారు. సీసీఐ ఆద్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు‘ ఏ’ గ్రేడ్‌ రకంకు రూ. 7020, ‘బీ’ గ్రేడ్‌కు రూ. 6620 కల్పించి కొనుగోలు చేస్తారు. జిల్లాలో రెండు కేంద్రాలు... అలంపూర్‌ తాలుకా పరిధిలో అలంపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వరసిద్ది వినాయక స్పిన్నింగ్‌ అండ్‌ జిన్నింగ్‌ మిల్లు, గద్వాల తాలుకా పరిధిలో జిల్లా కేంద్రంలోని బాలాజీ స్పిన్నింగ్‌ అండ్‌ జిన్నింగ్‌ మిల్లులలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విషయాన్ని మీడియా ద్వార రైతులకు తెలియజేశారు. కొనుగోళ్ళ కోసం తీసుకరావాల్సిన పత్రాల వివరాలను తెలియజేయడంతో పాటు, పత్తి నాణ్యత ప్రమాణాలు ఏవిదంగా ఉండాలన్న విషయాన్ని రైతులకు తెలియపరిచారు. అయితే మూడు రోజుల క్రితం అలంపూర్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు. గద్వాలలో మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సంబందిత మార్కెటింగ్‌ శాఖ అఽధికారులు తెలిపారు.

బయటి మార్కెట్‌లో ఎక్కువ ధరలు

ఈ ఏడాది పత్తి పంటను తక్కువగా సాగు చేశారు. ఇదే సందర్బంలో వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో బయటి మార్కెట్‌లో పత్తి ధరలు బాగా వస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధరకు మించి ఽ దరలు వస్తున్నాయి. క్వింటాకు రూ.7500 నుంచి రూ.8000 వరకు వస్తున్నాయి. దీంతో కొంత ఎక్కువ దిగుబడులు వచ్చిన ఇక్కడి రైతులు రాయచూర్‌ మార్కెట్‌కు పత్తిని తీసుకెళ్తున్నారు. తక్కువ దిగుబడులు వచ్చిన రైతులు మాత్రమే కేంద్రాలకు పత్తిని తీసుకెళ్ళె అవకాశం ఉంది.

మండలాల వారీగా

పత్తి సాగు ఇలా..

మండలం సాగు (ఎకరాల్లో)

అయిజ 21,779

మల్దకల్‌ 21,567

ఇటిక్యాల 16,873

వడ్డేపల్లి 16,579

గట్టు 15,628

మానవపాడు 13,803

గద్వాల 9,229

ఉండవెల్లి 7,893

కేటీదొడ్డి 7,805

రాజోళి 6,788

ధరూర్‌ 6,668

అలంపూర్‌ 1,483

Advertisement

What’s your opinion

Advertisement