Sakshi News home page

తోడు.. నీడగా

Published Sat, Nov 11 2023 1:38 AM

-

పతుల వెంట సతులు.. కొడుకు వెంట తల్లి

గద్వాల రూరల్‌: గతంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే క్రమంలో సమర్పించే అఫిడవిట్‌లో సమగ్ర వివరాలు లేకుండా నామమాత్రంగా వివరాలు సమర్పించేవారు. అయితే టీఎన్‌ శేషన్‌ కేంద్ర ఎన్నికల అధికారిగా పనిచేసిన కాలం నుంచి ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత చరిత్రతో పాటు స్థిర, చర ఆస్తులు, ఇతరత్రా నేరపూరిత కేసులు, శిక్షలు వంటి వివరాలన్నీ కూడా సంపూర్ణంగా నామినేషన్‌ దాఖలు చేసే అఫిడవిట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని కఠినతరమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో అభ్యర్థులు ఏమాత్రం అసమగ్రంగా.. సత్యదూరమైన వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చితే అసలుకే ఎసరు వచ్చి ఏకంగా అనర్హత వేటుకు గురవుతారు. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో గెలుపొందిన పలువురు ప్రజాప్రతినిధుల అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రత్యర్థి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం.. వాటిపై తీర్పులు వెలువడటం సంచలనంగా మారింది.

సమగ్రంగా.. సంపూర్ణంగా

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గతంలో మాదిరి ఏది పడితే అది చెబుతాం అంటే కుదరదు. ఇక నుంచి సమగ్ర, సంపూర్ణ వివరాలు ఇవ్వాల్సిందే. లేకపోతే చిక్కుల్లో పడినట్టే. దీంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను డమ్మీలుగా నామినేషన్లు వేయిస్తున్నారు. పొరపాటుగా తమ నామినేషన్‌ తిరస్కరణకు గురైతే.. తమవారు పోటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో రాజకీయాలంటే నాయకత్వంపై నమ్మకంతో కొనసాగేవి. కానీ, కాలానుగుణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు ‘నమ్మితే.. ముంచితి’ అన్న చందంగా మారాయి. దీంతో ఏళ్లపాటు తమ వెంటే ఉన్న అనుచరులు, శిష్యులను నమ్మడం కంటే తమ కుటుంబ సభ్యులపై నమ్మకం పెడుతున్నారు నేటితరం నాయకులు. ఇందుకు ఉదాహరణలే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ భార్యలు, తల్లుల చేత డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయించారు.

గద్వాల, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేటలో డమ్మీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే భార్యల నామినేషన్‌

జడ్చర్లలో కుమారుడికి

మద్దతుగా తల్లి సైతం..

ఉమ్మడి పాలమూరులో ‘వారసత్వ రాజకీయం’

Advertisement
Advertisement