పథకాలు పారదర్శకంగా అందించాలి | Sakshi
Sakshi News home page

పథకాలు పారదర్శకంగా అందించాలి

Published Wed, May 15 2024 7:00 AM

పథకాలు పారదర్శకంగా అందించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు పారదర్శకంగా అందించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంగళవారం కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య గెలుపు కోసం పాత, కొత్త అనే తేడా లేకుండా సమన్వయంతో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని, ఎన్నికల ముందు చేసిన హామీలకు అనుగుణంగా పలు పనులు చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే గ్రామాల్లో పర్యటించి సమస్యల్ని స్వయంగా పరిశీలించి ఆరు నెలల్లోపు పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. సెటిల్‌మెంట్లు, భూదందాలు చేసేవారిని సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి రానున్న రోజుల్లో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉందని, కాల్వలు, తూములు మరమ్మతు చేయించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కృషి చేస్తానన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లక్షా యాభై వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు బెలిదె వెంకన్నగుప్తా, నరేందర్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సారంగపాణి, ఇంద్రారెడ్డి, యాదగిరి, గట్టయ్య, శంకర్‌, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement
 
Advertisement
 
Advertisement