సదరెం.. ఇక నిరంతరం | Sakshi
Sakshi News home page

సదరెం.. ఇక నిరంతరం

Published Sun, May 26 2024 3:10 AM

సదరెం.. ఇక నిరంతరం

జగిత్యాల:సదరెం శిబిరాలు లేక దివ్యాంగులు ఇప్పటివరకు ఇబ్బంది పడ్డారు. వైద్యశాఖ ప్రకటించిన సమయానికి స్లాట్‌బుకింగ్‌ కాకపోవడం.. సాంకేతిక కారణాలు వీటికి తోడయ్యేవి. ఇక నుంచి ఆ సమస్య దూరం కానుంది. సదరెం శిబిరం కోసం అర్హులైన దివ్యాంగులు ఇక నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం సదరెం శిబిరాలను ఇక నిరంతరం చేస్తూ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దివ్యాంగులు ఎప్పుడైనా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు నెలలో రెండు, నాలుగు శిబిరాలు మాత్రమే నిర్వహించేవారు. దీంతో దివ్యాంగులు ఆ తేదీలకు వారం రోజుల ముందునుంచే మీసేవ చుట్టూ గంటల తరబడి నిలబడి స్లాట్‌ బుక్‌ చేసుకునేవారు. అంతేకాకుండా ఒక శిబిరంలో 100–120 మందికి మాత్రమే వైద్యశాఖ అధికారులు అవకాశం కల్పించేవారు. స్లాట్లు దొరకక నెలల తరబడి వేచిచూసేవారు. ఇకనుంచి తగిన ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన దివ్యాంగులు ఎప్పుడైనా మీసేవ కేంద్రాలకు వెళ్లి స్లాట్‌బుక్‌ చేసుకోవచ్చు.

సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ఆధారంగా..

స్లాట్‌ బుక్‌ చేసుకోగా శిబిరం తేదీ, స్థలం ఎక్కడ అన్నది మెసేజ్‌ వస్తుంది. స్లాట్‌ లేని పక్షంలో రిజర్వ్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఇస్తారో వారికి ఆటోమెటిక్‌గా స్లాట్‌ అలాట్‌ అవుతుంది. ఒకసారి బుక్‌ చేసుకోగానే మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. ఎడిట్‌ ఆప్షన్‌ కూడా ఉండదు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పుడే ఎలాంటి పొరపాట్లూ లేకుండా చూసుకోవాలని అధికారులు అంటున్నారు. మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో అన్ని సరిచూసుకున్నాకే సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఓ సంఖ్యను కేటాయించనున్నారు. ఆ ప్రకారం టోకెన్లు జారీ చేస్తారు. సమయం ప్రకటించినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది.

ఎప్పుడైనా స్లాట్‌బుకింగ్‌

తప్పనున్న తిప్పలు

ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

అర్హులైన వారు మీసేవకు వెళ్లి ఎప్పుడైనా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సమయం ఉంటే స్లాట్‌ ఇస్తారు. లేదా రిజర్వ్‌లో ఉంటుంది. తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి.

– రాములు, సూపరింటెండెంట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement