సర్పంచ్‌లకు బిల్లుల బెంగ | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు బిల్లుల బెంగ

Published Mon, Dec 11 2023 12:02 AM

జగ్గాసాగర్‌ పంచాయతీ కార్యాలయం - Sakshi

ఇలా ఈ ఇద్దరు సర్పంచ్‌లే కాదు. జిల్లాలో వందకు పైగా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి కోసం సొంత నిధులు వెచ్చించారు. ప్రజలు తమను సర్పంచ్‌గా ఎన్నుకున్నందుకు గ్రామాన్ని అభివృద్ధి చేసి వారి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ సొంత డబ్బులను వెచ్చించి పనులను చేపట్టారు. ఇందులో కొందరు అప్పు చేసి మరి ఖర్చు చేయడం గమనార్హం. కానీ చేసిన పనులకు ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో రూ.50కోట్లకు పైగానే బకాయిలు

జిల్లాలోని 20మండలాల్లో 380 పంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరవుతాయి. గ్రామాల్లో వీటితో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనులు చేపడుతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే సొంత నిధులతో పనులను చేపట్టి పూర్తి చేశారు. చేసిన వాటికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా మొత్తం మీద రూ.50కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉన్నట్లు తెలిసింది.

ముగియనున్న పదవీకాలంతో ఆందోళన

ప్రస్తుతమున్న సర్పంచ్‌ల పదవీ కాలం వచ్చే జనవరిలో ముగియనుంది. ఆ లోపు బిల్లులు వచ్చే అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షలు అప్పు తెచ్చి పనులు చేసిన కొందరు సర్పంచ్‌లు వాటికి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడం.. పదవీ కాలం ముగుస్తుండడంతో తమ బకాయిల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రూ.50కోట్లకుపైగా బకాయిలు అప్పు తెచ్చి ఖర్చు చేసిన వైనం

వచ్చేనెల ముగియనున్న పదవీకాలం

మెట్‌పల్లి మండలంలోని ఓ సర్పంచ్‌ గ్రామంలో మౌళిక వసతులు సమకూర్చడం కోసం సొంతంగా రూ.50లక్షలు వెచ్చించాడు. ఏడాది కాలంగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదే మండలంలోని మరో సర్పంచ్‌ కూడా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం సొంత డబ్బులు రూ.20లక్షలు ఖర్చు చేశాడు. రెండేళ్లుగా వీటి మంజూరు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా కూడా చేతికందలేని వాపోతున్నాడు.

– మెట్‌పల్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement