No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 14 2024 3:40 PM

-

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లా మరోమారు అట్టడుగునే నిలిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలింగ్‌ శాతం పెరగలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో 45.65 శాతం పోలింగ్‌ జరగ్గా ఈసారి దాదాపు 47 శాతం నమోదైనట్లు సమాచారం. ఎండ తీవ్రత వల్ల కూడా పోలింగ్‌పై ప్రభావం ఉంటుందని భావించినప్పటికీ సోమవారం ఎండ లేకపోవడం కొంతమేర ఊరటనిచ్చింది. కానీ ఆశించిన మేర పోలింగ్‌ పెరగలేదు. ప్రతిసారీ రాజధాని నగరమైన హైదరాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటంపై కలవరపడ్డ అధికార యంత్రాంగం వాస్తవానికి ఈసారి పోలింగ్‌ శాతం పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. రెండు నెలలుగా స్వీప్‌ కార్యక్రమాల కింద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. బాగా చదువుకున్నప్పటికీ, ఎన్నికల నిరక్షరాస్యులుగా మిగలొద్దని ప్రజలను కోరింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు.

జాబితా ప్రక్షాళన కాకపోవడమే..

నిజానికి గతంలో కంటే నగర జనం ఎక్కువ సంఖ్యలోనే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. ఓట్లు వేశారు. అయినప్పటికీ పోలింగ్‌ శాతం తక్కువగానే ఉండటానికి వివిధ కారణాలున్నాయి. ముఖ్యంగా ఓటరు జాబితా ప్రక్షాళన కాకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారు గణనీయంగా ఉన్నారు. అలాంటి వారిని తొలగించేందుకు గత రెండు సంవత్సరాలుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదు. దాంతో ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నందున పోలింగ్‌ శాతం తక్కువగా మాత్రమే నమోదవుతోంది.

తరలిన ఓటర్లు..

అటు ఏపీలో ఓట్లున్నవారిలో చాలామంది అక్కడకు వెళ్లారు. అలాంటి వారిలోనూ చాలామందికి ఇక్కడ కూడా ఓట్లున్నాయని చెబుతున్నారు. ఒకేరోజు పోలింగ్‌ రావడంతో ఉపాధి, వృత్తి, వ్యాపారాల కోసం ఇక్కడ ఉంటున్న వారు స్వస్థలానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో లక్షల సంఖ్యలో ఏపీకి ఓటర్లు తరలి వెళ్లారు. కొందరు తెలంగాణ జిల్లాల్లోని సొంత ఊర్లకు వెళ్లారు. ఇందువల్లే నగరంలో గతంలో ఇళ్లు కదలని వారు సైతం ఈసారి ఓట్లు వేసినా పోలింగ్‌ శాతం పెరగలేదు. నగర ప్రజలు ఓట్లేస్తున్నప్పటికీ, ఇలా వివిధ కారణాలతో ఆ మేరకు శాతం పెరగక బద్ధకస్తులనే ముద్ర తొలగిపోవడం లేదు. ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయనంతవరకు ఈ పరిస్థితి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్‌ కాని పోల్‌ క్యూ యాప్‌

పోల్‌ క్యూ రూట్‌ యాప్‌ ద్వారా తమ పోలింగ్‌ కేంద్రంలో ఎందరు క్యూలో ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు ప్రకటించినప్పటికీ, చాలా పోలింగ్‌ కేంద్రాల వివరాలు అప్‌డేట్‌ కాలేదు. అరగంటకోమారు అప్‌డేట్‌ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ మూడు నాలుగు గంటల వరకు కూడా అప్‌డేట్‌ జరగకపోవడంతో ప్రజలకు అది ఉపకరించలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement