ఈ రూట్‌లలో డిమాండ్‌ ఎక్కువ.. మరో 2,000 బస్సులు కావాలి | Sakshi
Sakshi News home page

ఈ రూట్‌లలో డిమాండ్‌ ఎక్కువ.. మరో 2,000 బస్సులు కావాలి

Published Mon, Dec 18 2023 5:02 AM

- - Sakshi

సిటీ ఆర్టీసీ బస్సులు ‘మహాలక్ష్మి’లతో కళకళలాడుతున్నాయి. మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతూ పరుగులు తీస్తున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సదుపాయంతో నగరంలో ప్రయాణించే మహిళల సంఖ్య విరివిగా పెరిగింది. గతంలో రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల మంది మహిళలు ప్రయాణం చేయగా.. ఈ నెల 9న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత వీరి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. నిత్యం సుమారు 8 లక్షల చొప్పున వారం రోజుల్లో 56 లక్షల మందికిపైగా మహిళా ప్రయాణికులు సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 

వంద శాతం ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం..
రెండు రోజులుగా మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌లను అందజేస్తున్న విషయం విదితమే. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయానికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులపై గత వారం రోజుల్లో ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మూడు సీట్ల ఆటోలు, సెవెన్‌సీటర్‌ ఆటోలు, షేర్‌ ఆటోలకు డిమాండ్‌ తగ్గింది. సిటీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 80 శాతం దాటింది. కొద్ది రోజుల్లోనే ఆక్యుపెన్సీ వంద శాతాన్ని అధిగమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు అదనపు బస్సులు అవసరమని భావిస్తున్నారు.

చిరుద్యోగులకు పెద్ద ఊరట..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వివిధ రంగాల్లో పని చేసే మహిళా చిరుద్యోగులు, వేతన జీవులకు ఉచిత బస్సు సదుపాయం ఎంతో ఊరటనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, హోటళ్లు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో పని చేసే హౌస్‌కీపింగ్‌ సిబ్బంది, సూపర్‌ మార్కెట్‌లు, షాపింగ్‌మాల్స్‌, వస్త్రాల దుకాణాలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, తదితర నిర్మాణ రంగంలో పని చేసే మహిళా కూలీలు, సెక్యూరిటీ గార్డులు, ఇళ్లల్లో పని చేసే వారికి ఉచిత బస్సు సదుపాయంతో ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోంది.

‘ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున వేతనాలు అందుకొనే మహిళలు చార్జీల రూపంలోనే రూ.2000 నుంచి రూ.3000 వరకు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ డబ్బులు మిగులుతున్నాయి. దాంతో ఇతర అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారు’ అని ఐద్వా మహిళా సంఘం నాయకులు సబిత తెలిపారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సిటీలో ప్రయాణికుల డిమాండ్‌, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. గ్రేటర్‌లో సుమారు 4.5 లక్షల మంది విద్యార్ధులు బస్‌పాస్‌లపై రాకపోకలు సాగిస్తుండగా వారిలో ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా అమ్మాయిలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయానికి మారారు. దీంతో అమ్మాయిలపై బస్‌పాస్‌ల భారం లేకుండా పోయింది.

ఈ రూట్‌లలో డిమాండ్‌ ఎక్కువ..
నగరంలోని వివిధ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంది. బోరబండ నుంచి హైటెక్‌ సిటీ, ఐటీ కారిడార్‌లకు ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది రాకపోకలు సాగిస్తారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్నఆసుపత్రులు, హోటళ్లు, భారీ వ్యాపార కేంద్రాలలో పని చేసే ఉద్యోగులు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు కూడా సుమారు 20 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా.

ఉప్పల్‌, బోడుప్పల్‌, మేడిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాచారం, ఉప్పల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా, చర్లపల్లి, తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌లలో ఉన్న ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌, వస్త్ర దుకాణాల్లో పని చేసే మహిళలు కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా అనేక సంఘటిత, అసంఘటిత రంగాల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ, పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

అద్దె బస్సులు తీసుకోవాల్సిందే..
‘ఉచిత ప్రయాణం సదుపాయంతో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. త్వరలో ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం దాటుతుంది. ఇప్పుడు ఉన్న 2,600 బస్సులు ఏ మాత్రం చాలవు. ప్రయాణికుల డిమాండ్‌, రద్దీ మేరకు ఇప్పటికిప్పుడు 2,000 బస్సులు అవసరం’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడం ఆర్థికంగా ఎంతో భారం. ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు కూడా. ఈ క్రమంలో అద్దె ప్రాతిపదికనప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల నుంచి బస్సులను తీసుకొని నడపాలని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement