టెన్త్‌ పరీక్షలు ముగిశాయ్‌

- - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికార యంత్రాంగం చేసిన విస్తృతమైన ఏర్పాట్లతో ఈనెల 18న పరీక్షలు మొదలైన రోజు నుంచి గుంటూరు జిల్లాలో ఎక్కడా.. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన ఆనందంలో విద్యార్థులు ఉత్సాహంగా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత గుంటూరు జిల్లాలో తొలిసారిగా జరిగిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మాల్‌ ప్రాక్టీసులకు తావు లేని విధంగా జరగడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. పరీక్ష కేంద్రా ల ఏర్పాటు మొదలు, వసతుల కల్పన, కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ను పోలీస్‌ స్టేషన్ల నుంచి పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పరీక్ష జరిగిన తరువాత ఆన్సర్‌ పేపర్లను పకడ్బందీగా ఏర్పాట్ల మధ్య తిరిగి పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేయడం వంటి అన్ని అంశాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలతో జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరీక్షల మానిటరింగ్‌ విభాగం నిరంతరం పరీక్షల సరళిని పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఇటు అధికారులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో నిముషం ఆలస్యం నిబంధన ఏదీ లేకపోవడంతో పాటు పరీక్షలు జరిగిన రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క విద్యార్థి సైతం ఆలస్యంగా వచ్చారనే కారణంతో పరీక్షకు అనుమతించని సంఘటన సైతం చోటు చేసుకోలేదు. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గాను 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

మాల్‌ ప్రాక్టీసులు లేని విధంగా సరికొత్త రికార్డు గుంటూరు జిల్లాలో ఇదే ప్రథమం

Election 2024

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top