ఐక్యరాజ్య... రాణులు! | women peacekeepers are helping people affected by conflict find safety, justice and rebuild their lives | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్య... రాణులు!

Oct 24 2026 4:49 AM | Updated on Oct 24 2026 4:49 AM

women peacekeepers are helping people affected by conflict find safety,  justice and rebuild their lives

నేడు ఐక్యరాజ్య సమితి దినోత్సవం

‘ఐక్యరాజ్య సమితి తరఫున వీరు వేరే దేశంలో పీస్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు’ అని చెప్పుకోవడం ఘనంగా, గర్వంగానే ఉంటుంది. అయితే అది అంత ఆషామాషీ విషయమేమీ కాదు. దేశం కాని దేశంలో, కల్లోలిత ప్రాంతంలో... అడుగుతీసి అడుగు వేస్తే ఎక్కడ మందుపాతర పేలుతుందో  తెలియదు. ఏ వర్గానికి కోపం వచ్చి ఎలా దాడి చేస్తుందో తెలియదు. కనిపించే హింస, కనిపించని కుట్రను తట్టుకొని కల్లోల దేశాల్లో శాంతికపోతాలు ఎగరేసిన, మహిళాసాధికారతకు  పట్టం కట్టిన మన దేశ మహిళా శాంతి పరిరక్షకుల గురించి...

శాంతిపరిరక్షణ కార్యక్రమాలు, కార్యచరణలో మనదేశం ఐక్యరాజ్యసమితికి అండగా ఉంటోంది. ఐక్యరాజ్యసమితి తరఫున లైబీరియాకు పూర్తిగా మహిళలతో కూడిన దళాన్ని పంపిన తొలిదేశం మనదే.

జీవితాన్ని మార్చింది!
మేజర్‌ సుమన్‌ గవానీ ఐక్యరాజ్యసమితి ప్రసిద్ధ పురస్కారం ‘మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ని 2019లో అందుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్‌వాల్‌ జిల్లాకు చెందిన సుమన్‌ గవానీ తండ్రి సైన్యంలో పనిచేశారు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో 2011లో సుమన్‌ భారత సైన్యంలో చేరారు.
 

శాంతిపరిరక్షణలో భాగంగా దక్షిణ సుడాన్‌ భద్రతాదళాలకు శిక్షణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షకురాలిగా తన అనుభవం, అనుభూతి గురించి 
సుమన్‌ ఇలా అన్నారు...
‘ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ మిషన్‌లో భాగంగా నీలిరంగు హెల్మెట్‌ ధరించి, భారత జెండాను ధరించడం నాకు ఒక గౌరవం. నా జీవితాన్ని మార్చేసిన అనుభవం. విభిన్న సంస్కృతులను గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రజల నుండి చాలా విషయాలు నేర్చుకోగలిగాను. అక్కడి ప్రజలతో మాట్లాడడానికి ఇబ్బంది రాకుండా స్థానిక భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. వారి భాషలోనే వారిని పలకరించినప్పుడు ఆత్మీయంగా మాట్లాడడం చూశాను’

ఒకే తాటిపై...
డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో శాంతిపరిరక్షకురాలిగా పనిచేసిన మేజర్‌ రాధికా సేన్, భద్రతాపరమైన సమస్యలను గురించి ప్రజలు ధైర్యంగా మాట్లాడేలా, ఆ సమస్యలను అధిగమించేలా చేసినందుకు ఐక్యరాజ్యసమితి ‘మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2023’ పురస్కారం అందుకున్నారు. 2023 నుండి 2024 వరకు రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు రాధికా సేన్‌.

బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చేసిన రాధికా సేన్‌ టెక్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకోలేదు. భారత సాయుధ దళాల్లో పనిచేయాలనుకున్నారు. సైన్యంలోకి వచ్చిన తరువాత ఐక్యరాజ్యసమితికి సంబంధించి రకరకాల శాంతికార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.  పిల్లలకు ఇంగ్లీష్‌ నేర్పించడం నుంచి నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి వృత్తిశిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక మహిళలు ఒక సంఘంగా ఏర్పడి తమ హక్కుల కోసం అడుగులు వేసే దిశగా వారిని తీర్చిదిద్దారు.

‘ఒక మహిళగా, పీస్‌కీపర్‌గా వివిధ సందర్భాలలో భావోద్వేగానికి గురికాకుండా ఉండడం కష్టం. కొంతవరకు అది బాధితుల సమస్యలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. సమస్యలను పరిష్కరించడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండేది. ఒక పరిష్కారాన్ని కనుగొని, దానిని మెరుగుపరచడానికి ఆ ప్రాంతంలోని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలన్నీ ఒకేతాటిపై వచ్చేలా చేశాం’ అన్నారు రాధికా సేన్‌.

కలలకు లింగభేదం లేదు
లెబనాన్‌లో ఐరాస శాంతిపరిరక్షకురాలిగా విధులు నిర్వహించిన మేజర్‌ అభిలాష బరాక్‌ 2025లో యూఎన్‌ ‘మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం అందుకున్నారు. హరియాణకు చెందిన అభిలాష, కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ కోర్సు పూర్తి చేసిన తరువాత కంబాట్‌ ఏవియేటర్‌గా ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్స్‌లో చేరిన మొట్టమొదటి మహిళా అధికారిగా ప్రత్యేకత నిలుపుకున్నారు.

‘కలలకు లింగభేదం’ లేదు అంటారు అభిలాష. లెబనాన్‌లో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటీరియమ్‌ ఫోర్స్‌’ ఎంగేజ్‌మెంట్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేశారు. స్థానిక ప్రజలలో నమ్మకాన్ని కలిగించడం నుంచి భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా కలిగించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విద్య, ఆరోగ్యం, వృత్తిశిక్షణా కార్యక్రమాల ద్వారా వేలాదిమంది మహిళలు, బాలికలకు దగ్గరయ్యారు. లింగ ఆధారిత హింస (జెండర్‌ బేస్డ్‌ వయెలెన్స్‌) బాధితుల కోసం ఒక ఏఐ ΄్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.
 
ఆ పదవికి మహిళలే లేరా?!
ఎనభై దశాబ్దాల ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఒక్క మహిళ కూడా సెక్రటరీ–జనరల్‌గా పనిచేయకపోవడం ఆశ్చర్యకరమే! లింగ సమానత్వం, మహిళా సాధికారితకు అంకితమైన ఐక్యరాజ్య సమితికి ఇది లోపమే. ప్రస్తుత సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్‌ పదవీకాలం డిసెంబర్‌ 31, 2026తో ముగుస్తుంది. పదవ యూఎన్‌ జనరల్‌ సెక్రటరీ ఎంపిక ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. బరిలో ఉన్న మహిళా అభ్యర్థులలో రెబెకా గ్రీన్‌స్పాన్, లానా నుస్సేబే, ఫెర్నాండా ఎస్పినోతో సహా ప్రముఖ మహిళా దౌత్యవేత్తలు, నాయకులు ఉన్నారు. ‘వివిధ విషయాల్లో రిస్క్‌ తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి వెనకాడుతుంది’ అన్నారు ఐక్యరాజ్యసమితి తదుపరి అధిపతికి ప్రధాన పోటీదారు అయిన రెబెకా గ్రిన్‌స్పాన్‌. రెబెక గెలిస్తే... ఐక్యరాజ్య సమితి చరిత్రలో మొదటి మహిళా జనరల్‌–సెక్రటరీగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement