భిన్నత్వంలో ఏకత్వం.. పుదుచ్చేరి సొంతం | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వం.. పుదుచ్చేరి సొంతం

Published Tue, Apr 9 2024 11:40 PM

ఫ్రెంచ్‌ నగరాలను తలపించేలా ఉన్న పుదుచ్చేరిలోని ఓ వీధి - Sakshi

ఒకరు మాజీ సీఎం..

మరొకరు సీఎం మేనల్లుడు

ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న 73 ఏళ్ల వైథిలింగం 1991 నుంచి 1996 వరకూ పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం మళ్లీ 2008 నుంచి 2011 వరకూ సీఎంగా వ్యవహరించారు. అంతేకాదు ఎనిమిదిసార్లు ప్రజాప్రతినిధిగా సీనియర్‌ లెజిస్లేటర్‌గా ఆయనకు మంచి పేరుంది. 2016 నుంచి 2019 వరకూ స్పీకర్‌గానూ వ్యవహరించారు. 1980 నుంచి 2006 వరకూ నెట్టిపాకం ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2011–2016 వరకు కామరాజ్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెడియార్‌ సామాజికవర్గానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన వారి పూర్వీకులు పుదుచ్చేరిలో స్థిరపడ్డారు. వారిది స్వాత్రంత్య్ర సమరయోధుల కుటుంబం. అంతేకాదు వైథిలింగం తండ్రి వి.వెంకటసుబ్బ రెడియార్‌ పుదుచ్చేరికి రెండో సీఎంగా పనిచేశారు.

● ప్రస్తుతం పుదుచ్చేరి హోంమంత్రిగా ఉన్న 54 ఏళ్ల నమశ్శివాయం 2021 వరకూ పుదుచ్చేరి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారనే కారణంతో ఆయనను పార్టీ సస్పెండ్‌ చేసింది. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే ఏడాది బీజేపీలో చేరి మన్నాడిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సీఎం రంగసామికి స్వయానా మేనల్లుడు. 2011లో ఓల్గరేట్‌ నియోజకవర్గం, 2016 నుంచి 2021 వరకూ వెల్లునూర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు.

యానాం: పుదుచ్చేరి.. అక్కడ నివసించే ప్రజలంతా ఒకే కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారే అయినా ఒకరు తెలుగు మాట్లాడుతుంటే మరొకరు తమిళంలో దంచి కొడతారు. ఇంకొకరు మలయాళంలో సంభాషిస్తే ఆ పక్కనే ఫ్రెంచ్‌ భాష వినిపిస్తుంది. పండగల సంగతి సరేసరి.. కొందరు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటే మరికొందరు ఓనమ్‌ను వేడుకగా చేసుకుంటారు. మరోవైపు దశాబ్దాల క్రితమే వ్యాపారం కోసం వచ్చి స్థిరపడిన ఫ్రెంచ్‌ కుటుంబాలు ఇక్కడి సంస్కృతిలో మమేకమై కలిసి జీవిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వివిధ భాషలు, విభిన్న సంస్కృతుల కలయిక పుదుచ్చేరి సొంతం.. భిన్నత్వంలో ఏకత్వం అక్కడి ప్రజల తత్వం.. అందుకే దేశంలోని మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలకు పుదుచ్చేరికి స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

మూడు రాష్ట్రాల్లో విస్తరించిన లోక్‌సభ స్థానం

తమిళంలో పుదు–చ్చేరి అంటే కొత్త ఊరు అని అర్థం. 1674లో ఫ్రెంచ్‌వారు ఇక్కడ ఒక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాక పాండిచ్చేరి అని పిలవడం మొదలుపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించి అధికారికంగా పుదుచ్చేరిగా మార్చింది. భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో పుదుచ్చేరి ఒకటి. స్థానికంగా ఉండే వీధులు, ఇళ్లు ఫ్రెంచి నగరాలను తలపిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భౌగోళికంగా యానాం, మాహే, కారైకల్‌, పుదుచ్చేరిలతో కలిసి నాలుగు భాగాలుగా ఉంది. బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా యానాం, అరేబియన్‌ సముద్ర తీరాన కేరళ సరిహద్దు వద్ద మాహే, తమిళనాడు సరిహద్దుల వద్ద కారైకల్‌, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఒకప్పుడు 1723లో ఫ్రెంచివారు ఆక్రమించిన యానాంలో తెలుగు మాట్లాడుతుంటే, మాహేలో మలయాళం, పుదుచ్చేరి, కారైకల్‌లో తమిళం, అక్కడే స్థిరపడిన విదేశీయులైన ఫ్రెంచివారు ఫ్రెంచి భాషను మాట్లాడు తుంటారు. రాజధాని పుదుచ్చేరికి యానాం 811 కిలోమీటర్ల దూరంలో ఉంటే, కేరళ వద్ద నున్న మాహే 628 కిలోమీటర్ల దూరంలో ఉంది. 132 కిలోమీటర్ల దూరంలో కారైకల్‌ ఉంది. ఈ నాలుగు రీజియన్లలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి పుదుచ్చేరి ఏకై క లోక్‌సభ స్థానంగా మారింది.

వేడెక్కిన రాజకీయ వాతావరణం

పుదుచ్చేరి ఏకై క లోక్‌సభ స్థానానికి ఈ నెల 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తంగా 10,23,699 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 4,80,069 మంది ఉండగా, మహిళలు 5,42,979 మంది, థర్డ్‌ జెండర్‌ 148 మంది ఉన్నారు. అందుకే పుదుచ్చేరి ఎంపీ స్థానంలో గెలుపెవరిదో నిర్దేశించేది కచ్చితంగా మహిళలేని ఘంటాపథంగా చెప్పొచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో ఏకంగా 19 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లు కావడం విశేషం. ఎంతమంది బరిలో నిలిచినా బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి తరఫున పోటీ చేస్తున్న హోంమంత్రి నమశ్శివాయం, కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగుతున్న సిట్టింగ్‌ ఎంపీ వైథిలింగం మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ సీనియర్‌ నేతలే కావడంతో తమ ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు గెలుపు వ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానానికి 1967 నుంచి ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు జరగగా దాంట్లో ఏకంగా 12 సార్లు కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులే గెలుపొందడం విశేషం. రానున్న ఎన్నికల్లో పోటీచేయనున్న హోంమంత్రి నమశ్శివాయంకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ మద్దతిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

వివిధ భాషలు,

విభిన్న సంస్కృతుల కలయిక

ఈ నెల 19న పుదుచ్చేరిలో

ఏకై క లోక్‌సభకు ఎన్నిక

ప్రఖ్యాత అరబిందో ఆశ్రమం
1/3

ప్రఖ్యాత అరబిందో ఆశ్రమం

కాంగ్రెస్‌ అభ్యర్థి 
వి.వైథిలింగం
2/3

కాంగ్రెస్‌ అభ్యర్థి వి.వైథిలింగం

ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ కూటమి అభ్యర్థి నమశ్శివాయం
3/3

ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ కూటమి అభ్యర్థి నమశ్శివాయం

Advertisement
Advertisement