నేత్రపర్వంగా సత్యదేవుని రథోత్సవం | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా సత్యదేవుని రథోత్సవం

Published Thu, May 23 2024 12:40 AM

నేత్ర

అన్నవరం: శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు బుధవారం కొండ దిగువన నిర్వహించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. సత్యరథాన్ని ఉదయం తొమ్మిది గంటలకు పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రథాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను అర్చకస్వాములు ఊరేగింపుగా కొండదిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన నూతన రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు రథం ముందు కుంభం పోసి గుమ్మడికాయతో అర్చకులు దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌ కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వందల సంఖ్యలో భక్తులు దేవస్థానం సిబ్బంది, ధవళేశ్వరం నుంచి వచ్చిన రథం నడిపే నిపుణులు రథాన్ని లాగారు. తొలిపావంచా వద్ద నుంచి ఆంధ్రాబ్యాంక్‌ వరకు, అక్కడి నుంచి దేవస్థానం హైస్కూల్‌ వద్ద గల టోల్‌గేట్‌ వరకు తిరుగు ప్రయాణంలో మరలా తొలిపావంచా వద్దకు రథోత్సవం కొనసాగింది. అనంతరం స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి ఊరేగింపుగా సత్యదేవుని ఆలయానికి చేర్చారు. దేవస్థానం డిఫ్యూటీ ఈఓ రమేష్‌ బాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథరాజు, ఇంజినీరింగ్‌ ఈఈలు మురళి, నరసింహరెడ్డి, డీఈలు ఉదయ్‌, బీఎస్‌ రాంబాబు, ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ, ఏఈఓలు పాల్గొన్నారు. రథోత్సవంలో మొదట గ్రామస్ధులు తక్కువగా ఉన్నా, ఆరు గంటల సమయానికి వేల సంఖ్యలో తరలిరావడంతో అన్నవరం మెయిన్‌రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈఓ కె.రామచంద్రమోహన్‌ రథోత్సవం ప్రారంభం నుంచి చివరి వరకు నాలుగు గంటల పాటు మైకు ద్వారా సిబ్బందికి సూచనలిచ్చారు.

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు

ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు భక్తులు, గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కోలాటం, కేరళ డప్పులు, పులివేషాలు అందరినీ ఆకర్షించాయి. సత్యదేవుని రధోత్సవంలో రథానికి విద్యుత్‌ అలంకరణ చేసినా సాంకేతిక కారణాలతో వెలిగించ లేదు. స్వామి, అమ్మవార్లకు, రథం ముందు ఫోకస్‌ లైట్లు తప్ప విద్యుత్‌ అలంకరణ లేదు.

36 అడుగుల ఎత్తయిన రథంపై

ఊరేగిన స్వామి, అమ్మవార్లు

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు

నేత్రపర్వంగా సత్యదేవుని రథోత్సవం
1/1

నేత్రపర్వంగా సత్యదేవుని రథోత్సవం

Advertisement
 
Advertisement
 
Advertisement