ఆఊరిగాయల రుచే వేరు! | Sakshi
Sakshi News home page

ఆఊరిగాయల రుచే వేరు!

Published Tue, May 21 2024 10:25 AM

ఆఊరిగ

పచ్చళ్ల తయారీలో ఆ గ్రామాలు అదుర్స్‌

విదేశాలకు సైతం ఎగుమతి

పలు కుటుంబాలకు జీవనోపాధి

ఆత్రేయపురం: ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ఊరు ప్రసిద్ధి. కానీ ఊరగాయల తయారీకి మాత్రం ఆ గ్రామాలే పెట్టింది పేరు. అక్కడ నుంచి ఊరగాయలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఆ గ్రామాల వారు పచ్చళ్ల తయారీతో జీవనోపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆహా ఏమి రుచి తినరా మైమరచి అన్నట్టు... తినేవారికి నోరూరించే పచ్చళ్ల తయారీకి ఆత్రేయపురం మండలం ప్రసిద్ధి చెందింది. ఆవకాయకు ఆంధ్రా పెట్టింది పేరు కాగా కోనసీమలోని ఆత్రేయపురం, నార్కెడిమిల్లి, అంకంపాలెం, ఉచ్చిలి, ర్యాలి గ్రామాలు పచ్చళ్ల తయారీకి ప్రసిద్ధి చెందాయి. ఆవకాయ పచ్చడి తయారీలో ఈ గ్రామాల వారు మామిడికాయలకు కారం, నూనె, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి, మెంతులు తదితర మసాలా దినుసులతో పాటు, ఆప్యాయతలు రంగరించి సొంత వాడకానికి చేసినట్టుగా పచ్చళ్లు తయారు చేస్తుంటారు. దీంతో వీటి ముందు కార్పొరేట్‌ కంపెనీల పచ్చళ్లు సైతం దిగదుడుపే అవుతాయి.

కుటీర పరిశ్రమగా..

ఆత్రేయపురం మండలంలో నార్కెడిమిల్లి, ఆత్రేయపురం, అంకంపాలెం, ఉచ్చిలి, ర్యాలి గ్రామాల్లో సుమారు 15 వేలకు పైగా జనాభా ఉండగా 20 శాతం మంది పచ్చళ్ల తయారీనే కుటీర పరిశ్రమగా ఎంచుకుని జీవనోపాధి పొందుతున్నారు. సుమారు వెయ్యి కుటుంబాల వారు వేసవిలో పచ్చడి తయారు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు సాగిస్తుంటారు. దీంతో పాటు సీజన్‌ల వారిగా ఏడాది పొడవునా వివిధ రకాల పచ్చళ్లు తయారు చేస్తుంటారు. ఆవకాయ, తీపి ఊరగాయ, మాగాయ, టమాటా, అల్లం, ఎండు మిరపకాయ, చింతకాయ, ఉసిరి, గొంగూర, నిమ్మకాయ, కాలీఫ్లవర్‌, ములక్కాడ పచ్చళ్ళను ఆయా సీజన్‌లను బట్టి తయారు చేస్తుంటారు. ఎంచుకున్న కూరగాయలతో పాటు తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లి, పోపులు, నూనె వంటి దినుసులు వేసి వీరి చేతులతో కలిపితే ఆ రుచులే వేరు. మహిళలు తయారు చేసిన పచ్చళ్లను కుటుంబంలోని పురుషులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. కడప, పులివెందుల, విశాఖపట్నం, హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరులో ఈ పచ్చళ్ళకు మంచి పేరుంది. విదేశీ గడ్డపై కూడా ఈ పచ్చళ్లు నోరూరిస్తూ ఆంధ్రా సత్తా చాటుకున్నాయి. నార్కెడిమిల్లిలో సుమారు 170 డ్వాక్రా సంఘాలు పావలా వడ్డీ రుణాలతో పచ్చళ్లు తయారు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు.

పెరిగిన ధరలతో తయారీ భారం

ఆవకాయ తయారు చేసేందుకు ఉపయోగించే మామిడికాయలు, ఇతర దినుసుల ధరలు పెరగడంతో పచ్చళ్ల తయారీ పెనుభారమౌతోందని ఈ పరిశ్రమపై ఆధారపడిన వారు అంటున్నారు. మామిడికాయ టన్ను ఒక్కింటికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకు చెల్లిస్తుండగా ఎండుమిర్చి క్వింటాల్‌ రూ.18 వేల నుంచి రూ.20 వేలు, క్వింటాల్‌ ఉప్పు బస్తా రూ.400, 20 లీటర్ల నూనె డబ్బా రూ.3,500, ఆవాల బస్తా రూ.700, మెంతులు బస్తా రూ.900, వెల్లుల్లి క్వింటాల్‌కు రూ.15వేలు పలుకుతుందని చెబుతున్నారు. దీనికితోడు కూలీ ధరలు విపరీతంగా పెరగడంతో టన్ను మామిడికాయలతో తయారు చేసిన పచ్చడికి సుమారు రూ.65 వేలు ఖర్చు అవుతోంది. ఈ గ్రామాల వారు ఇంటి వద్ద కేజీ పచ్చడి రూ.225 నుంచి రూ.300కి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వీరి వద్ద నుంచి కొనుగోలు చేసిన చిరు వ్యాపారాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో విక్రయించి జీవనోపాధి పొందుతారు. సీజన్‌ వారీగా పచ్చళ్లను తయారు చేసి ఏడాది పొడవునా దాన్ని భద్రపరచి అమ్మకాలు సాగిస్తుంటారు. అందుకు గాను వేసవిలో తమకున్న పరపతినంతా ఉపయోగించి మూడు వేల కుటుంబాల వారు ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల వద్ద రుణాలు తెచ్చి పచ్చళ్లు తయారు చేస్తారు. సగటున ఒక్కొక్క కుటుంబం వారు పది టన్నుల మామిడికాయలు దిగుమతి చేసుకుంటారు. అందుకే వేసవిలో ఈ గ్రామాల్లో ఏ ఇంట చూసినా మామిడిరాశులు కనుల విందు చేస్తాయి. మూడు వేల కుటుంబాల వారు సుమారు 30 వేల టన్నుల వరకు మామిడికాయలను దిగుమతి చేసుకుంటారు.

పచ్చళ్ల తయారీతో ఉపాధి

పచ్చడి తయారీతో జీవనోపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. గత 30 ఏళ్లుగా పచ్చడి తయారీలో అనుభవం ఉంది. – సుంకర బ్రహ్మానందం, అంకంపాలెం

వేసవిలో తయారు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తాను

ఏటా వేసవిలో పెట్టుబడులు పెట్టి పచ్చళ్లు తయారు చేస్తాను. ఆ పచ్చళ్లను హైదరాబాద్‌, వైజాగ్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ పలువురి ఉపాధికి తోడ్పడుతున్నాను.

– అడ్డాల రమేష్‌, ఆత్రేయపురం

ఆఊరిగాయల రుచే వేరు!
1/4

ఆఊరిగాయల రుచే వేరు!

ఆఊరిగాయల రుచే వేరు!
2/4

ఆఊరిగాయల రుచే వేరు!

ఆఊరిగాయల రుచే వేరు!
3/4

ఆఊరిగాయల రుచే వేరు!

ఆఊరిగాయల రుచే వేరు!
4/4

ఆఊరిగాయల రుచే వేరు!

Advertisement
 
Advertisement
 
Advertisement