బంగారం అంత భారీ పతనం.. ఇందుకేనా? | Gold Rate Crash Today Why Is Gold Price Falling Key Reasons | Sakshi
Sakshi News home page

బంగారం అంత భారీ పతనం.. ఇందుకేనా?

Oct 22 2026 10:03 PM | Updated on Oct 22 2026 10:04 PM

Gold Rate Crash Today Why Is Gold Price Falling Key Reasons

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పతనం, అమెరికాలో వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలో కొనసాగే అవకాశాలు, ముడిచమురు ధరల పెరుగుదలతో నెలకొన్న ద్రవ్యోల్బణ ఆందోళనలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచాయి. గురువారం (అక్టోబర్‌ 22) ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,700 తగ్గి రూ.1.45 లక్షల దిగువకు చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర సైతం 10 గ్రాములకు రూ.1,550 మేర క్షీణించింది. దీంతో పండుగల వేళ పసిడి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభించింది.

అంతర్జాతీయ మార్కెట్లో పతనం

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు రెండు నెలలకు పైగా కనిష్ఠ స్థాయికి పడిపోవడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సుకు 2.1 శాతం తగ్గి 4,055.69 డాలర్లకు చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదవడం, ముడిచమురు ధరలు పెరగడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలో కొనసాగించవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ ఆదాయం అందించని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి, బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు తగ్గుతుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పసిడి ధరలపై ఒత్తిడిని పెంచింది.

లాభాల స్వీకరణ కూడా కారణమే!

ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగడం కూడా ప్రస్తుత పతనానికి కారణమైంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకోవచ్చనే ఆందోళనలకు దారితీసింది. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, బాండ్‌ రాబడుల్లో మార్పులు, అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల వైఖరి.. ఇవన్నీ కలిసి బంగారం ధరల్లో ఒడుదొడుకులకు కారణమవుతున్నాయి.

కొనుగోలుదారులకు ఎంతవరకు ఊరట?

ధనత్రయోదశి, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. అయితే, ధరలు మరింత తగ్గుతాయని ఇప్పుడే అంచనా వేయలేం. అమెరికా ద్రవ్య విధానం, డాలర్‌ మారకం విలువ, అంతర్జాతీయ బాండ్‌ రాబడులు, ముడిచమురు ధరల్లో మార్పులు పసిడి తదుపరి కదలికలను ప్రభావితం చేయనున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేసేవారు తమ నగరంలోని తాజా ధరలను పరిశీలించడంతో పాటు తరుగు, తయారీ ఛార్జీలు, జీఎస్‌టీని కలిపిన తుది ధరను కూడా గమనించాలి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

gold and silver price1
1/4

gold and silver price2
2/4

gold and silver price3
3/4

gold and silver price4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement