చికిత్స పొందుతున్న వ్యక్తి... | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి...

Published Wed, May 15 2024 1:10 AM

-

అశ్వారావుపేటరూరల్‌: ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. ఏపీ లోని తిరుపతి ప్రాంతానికి చెందిన గుజరాత్‌ రాహుల్‌ (35)కు పదిహేనేళ్ల కిందట అశ్వారావుపేట మండల కేంద్రంలోని నందమూరినగర్‌కు చెందిన శిల్పతో వివాహమైంది. కాగా, మనస్పర్దల కారణంగా భార్య పుట్టింటికి వచ్చింది. దీంతో ఈ నెల 10వ తేదీన రాహుల్‌ భార్య వద్దకు వచ్చి కాపురానికి రావాలని కో రగా, ఆమె నిరాకరించడంతో బంధువులతో మాట్లాడిన తరువాత స్థానిక ఆర్‌టీఎస్‌ చెక్‌పోస్టు సమీపంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే. గమనించిన స్థానికులు, కానిస్టేబుల్‌ మనోజ్‌ రక్షించి స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్న క్రమంలోనే ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై మృతుడి తమ్ముడు గుజరాత్‌ వెంకటేశ్వరరావు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడు..

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామ పంచాయతీ లలితాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో పూనెం ధన్‌రాజ్‌ (38) మంగళవారం మృతిచెందా డు. ఇంట్లో ఫ్యాన్‌ సరిగా తిరగడం లేదని స్వయంగా వైర్లు తొలగించి స్విచ్‌ ఆఫ్‌ చేయకుండానే బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ధన్‌రాజ్‌ మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదగిరి అతని చిన్నతనంలోనే మృతిచెందగా అంగన్‌వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న తన తల్లి ఆదెమ్మ ఉంది. భర్తను, ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆదెమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఆదెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement