వడ్డీ వ్యాపారులపై నిఘా | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారులపై నిఘా

Published Sat, Apr 20 2024 12:10 AM

బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారి - Sakshi

●జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ●అధిక వడ్డీలను అరికట్టేందుకే దాడులు

అశ్వారావుపేట: సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి దోపిడీకి పాల్పడే వారిపై పోలీసులు దృష్టి సారించారు. గత శనివారం రాత్రి జిల్లాలో పలుచోట్ల వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అశ్వారావుపేట, సుజాతనగర్‌, ఇల్లెందు ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. రిజిస్టర్డ్‌, అన్‌ రిజిస్టర్డ్‌ చిట్‌ వ్యాపారులు, ఫైనాన్స్‌, గోల్డ్‌ ఫైనాన్స్‌ వ్యాపారులను విచారించనున్నట్లు సమాచారం. జిల్లాలోని ఓ పోలీస్‌ ఉన్నతాధికారిని సంప్రదించగా దాడులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఎన్నికలకు, ఎన్నికల కోడ్‌కు దాడులకు సంబంధం లేదని పేర్కొన్నారు. అధికవడ్డీలకు వ్యాపారాలు చేస్తూ దోపిడీకి పాల్పడే వారిని తొలుత హెచ్చరించాలని, అప్పటికీ మారకపోతే చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. అశ్వారావుపేటలో ఇద్దరు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా, వారి లైసెన్స్‌లు రెన్యువల్‌ చేసినట్లు, అన్ని పద్దులు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. ఏపీ నుంచి వచ్చి ఇల్లెందులో ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, వ్యాపారం ఆపేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. సుజాతనగర్‌లో ఓ వ్యాపారిని విచారించి, తాకట్టు పెట్టుకున్న నాలుగు టూవీలర్లు, ప్రాంసరీ నోట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విధంగా దాడులు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ముందుగానే 20 శాతం కమీషన్‌..

రిజిస్టర్డ్‌ వడ్డీ వ్యాపారులను అధిక వడ్డీలు వసూలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏపీ నుంచి అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో అధిక వడ్డీలకు డబ్బులిస్తున్నారు. ముందుగానే 20 శాతం కమీషన్‌ కట్‌ చేసుకుంటున్నారు. వారానికి కొంత మొత్తం చెల్లించేలా మూడు నెలల్లో బాకీ తీర్చాలని షరతులు పెడుతున్నారు. ఒక వారం కట్టలేకపోయినా దుర్భాషలాడి పరువు తీస్తారు. దీనికితోడు అశ్వారావుపేటలోని టూవీలర్‌ షోరూంల నిర్వాహకులు ఏపీలోని రాజమండ్రి ప్రాంత ఫైనాన్స్‌ వ్యాపారులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. బైక్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి షోరూంలోనే ఫైనాన్స్‌ సౌకర్యం లభిస్తుంది. కానీ అప్పు మాత్రం తీరనివ్వరు. ఒక్క కిస్తా కట్టకపోయినా ఓడీలంటూ భారీ పెనాల్టీలు విధిస్తారు. సెకండ్‌ హ్యాండ్‌ టూవీలర్‌ ఫైనాన్స్‌ దుకాణాలు ఇదే దందా కొనసాగిస్తున్నాయి. వీటి నిర్వాహకులపై కూడా పోలీసులు దృష్టి సారించాల్సి ఉంది.

వ్యాపారులపై చర్యలు

వడ్డీ వ్యాపారుల ఇళ్లలో గత ఇటీవల సోదాలు నిర్వహించాం. పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేయొద్దు. ఇలా ఎవరు చేసినా ఫిర్యాదు చేయండి. తగిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తాం.

–జితేందర్‌ రెడ్డి, సీఐ అశ్వారావుపేట

1/1

Advertisement
Advertisement