మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట | Sakshi
Sakshi News home page

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

Published Fri, Dec 8 2023 1:18 AM

రాయచోటిలో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఆటోల అప్పగింత   - Sakshi

రాయచోటి: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ఉన్నతి – మహిళా శక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు మంజూరైన ఆటో రిక్షాలను జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతి– మహిళా శక్తి పథకం కింద ఎస్సీ, ఎస్టీ నిరుపేద మహిళలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ లేని రుణాల ద్వారా అన్నమయ్య జిల్లాలో 11 మందికి ఆటోలు ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ఒక్కో లబ్ధిదారు 10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 90 శాతం వడ్డీ లేని రుణం ద్వారా 48 కంతుల్లో తిరిగి డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆటోలను లబ్దిదారులు అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఆటోలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సైనికుల సేవలు వెలకట్టలేనివి

దేశ రక్షణలో ప్రాణాలకు ఎదురొడ్డి సైనికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాయుధ దళాల నిధికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నిధికి తనవంతు బాధ్యతగా జిల్లా కలెక్టర్‌ విరాళం అందజేశారు. అలాగే జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలపై దేశం గర్విస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్‌ సంక్షేమశాఖ అధికారి ఐజే రఘురామయ్య, కార్యాలయ సిబ్బంది నవనీశ్వర్‌ రెడ్డి, సురేష్‌ కుమార్‌, ఎన్‌సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టాన్ని అంచనా వేయాలి

రాయచోటి: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పకడ్బందీగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లు, జేసీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌లకు సంబంధించి వివిధ పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంటనష్టం వివరాలు పక్కాగా నమోదు చేసి వెంటనే నివేదికను పంపాలన్నారు. ఇందులో ఏ ఒక్క రైతు దగ్గర నుంచి కూడా ఫిర్యాదులు రాకూడదన్నారు.

జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌

లోపాలు లేని ఓటరు జాబితా రూపొందించాలి

చిన్నమండెం: లోపాలు లేని ఓటరు జాబితా రూపొందించాలని, ఇందులో బీఎల్‌ఓల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ పేర్కొన్నారు. గురువారం చిన్నమండెం మండలం టి.చాకిబండ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. బీఎల్‌ఓల వద్ద ఉన్న ఓటరు జాబితా రిజిస్టర్లను తనిఖీ చేశారు. ముసాయిదా జాబితా ప్రచురించిన తేదీ నుంచి నేటి వరకు సదరు సచివాలయ పరిధిలో ఇంటింటి పరిశీలన, ఫామ్‌ 6,7,8, 8ఏ ఎన్ని వచ్చాయి. వాటిలో పరిశీలించి.. పరిష్కరించినవి ఎన్ని, జంక్‌ క్యారెక్టర్‌ ఓట్లు, ఒకే డోర్‌ నెంబర్‌పై 10 కంటే ఎక్కువ ఓట్లు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఫామ్‌ 6,7,8, 8ఏలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందుకు సంబంధించి బీఎల్‌ఓలు రిజిస్టర్‌లను తప్పనిసరిగా మెయింటైన్‌ చేయాలన్నారు. 18–19 యువ ఓటర్ల సంఖ్య ఎంత, నమోదు శాతం అంశాన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనునాయక్‌, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటలో దుర్గమ్మ ఆటోలో పయనిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
1/1

రాజంపేటలో దుర్గమ్మ ఆటోలో పయనిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

Advertisement
Advertisement