రాష్ట్రంలో నకిలీలకు ఏపీ మెడికల్ కౌన్సిల్ అండదండలు
ఫిర్యాదులపై విచారణ చేసి నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యం
అనంతపురంలో నకిలీ వైద్యుడి చేతిలో మహిళ మృతి
ఏపీఎంసీ నిర్లక్ష్యమే ప్రధాన కారణం
సాక్షి, అమరావతి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందేలా చూడటంతో పాటు నకిలీ వైద్యులపై కొరడ ఝుళిపించాల్సిన ఏపీ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ)ను చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులతో నింపేసింది. కౌన్సిల్‌లో తిష్టవేసిన కీలక వ్యక్తులు నకిలీ వైద్యుల మాఫియాకు అండగా నిలుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నకిలీ వైద్యులపై కౌన్సిల్‌కు వచ్చిన ఫిర్యాదులతోపాటు విచారణ నివేదికలను సైతం బుట్టదాఖలు చేస్తున్నారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అనంతపురంలో నకిలీ వైద్యుడి చేతిలో నరసమ్మ అనే మహిళ బలైపోవడానికి ఏపీఎంసీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలోనే స్పష్టమైన ఫిర్యాదులు, నివేదికలు అందినా చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టడం వల్లే ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టి..
అనంతపురంలో మహిళ మరణానికి కారణమైన మేఘన ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు ఆర్‌ఎంపీ జి.రమణపై ఈ ఏడాది జూన్‌లోనే ఏపీఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుపై విచారణ అనంతరం ఏపీఎంసీలోని నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సెప్టెంబర్‌లో నివేదిక సమర్పించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఏపీఎంసీ చైర్మన్ నిర్లక్ష్యం చేసిందని సమాచారం. వాస్తవానికి ఇలాంటి ఘటనల్లో వెంటనే సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో, ఔషధ నియంత్రణ, పోలీసు విభాగాలను ఏపీఎంసీ అప్రమత్తం చేయాలి. నిబంధనల ప్రకారం నకిలీ వైద్యులపై చర్యలకు ఆదేశించాలి.
సెప్టెంబర్‌లో నివేదిక సమర్పించినా ఏపీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నకిలీ వైద్యుడి చేతుల్లో ఈ నెల 17న నరసమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. అనంతపురం, విశాఖపట్నం ఇలా వివిధ జిల్లాల్లో నకిలీ వైద్యులపై చేసిన విచారణ నివేదికలను చైర్మన్ తొక్కిపెట్టారని కౌన్సిల్ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఏపీఎంసీ చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే పూర్తి అధికారం చైర్మన్‌కు మాత్రమే ఉంది. అదే చైర్మన్ నివేదికలను అటకెక్కించడం వెనుక మతలబేమిటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
నివేదికల్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది
నకిలీ వైద్యుల నివారణ కమిటీ సభ్యుడిగా అనంతపురంలో తనిఖీలు చేసి సమగ్ర నివేదిక ఇచ్చినా చైర్మన్ చర్యలు తీసుకోకపోవడం దారుణం. హైకోర్టు ఆదేశాలున్నా ఈ జాప్యం ఎందుకు చేశారు. ఏపీఎంసీకి ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం ఏముంది? ఫిర్యాదులను కమిటీ ముందుకు తీసుకురాకుండా దాచిపెడుతున్నారు. అర్హత కలిగిన వైద్యులపై విచారణల్లో చూపించే వేగం నకిలీలపై ఎందుకు ఉండటం లేదు? తక్షణమే నకిలీ వైద్యులపై వచ్చిన అన్ని ఫిర్యాదులను బయటపెట్టి డీఎంహెచ్‌వో, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో సమన్వయం చేసుకుని నకిలీలపై కఠిన చర్యలు చేపట్టాలి. – డాక్టర్ కురువ శ్రీహరి, ఏపీఎంసీ నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడు


