కౌంటింగ్‌ ప్రశాంతంగా సాగాలి | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ ప్రశాంతంగా సాగాలి

Published Sat, May 25 2024 4:35 PM

కౌంటింగ్‌ ప్రశాంతంగా సాగాలి

అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న చేపట్టే ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. కౌంటింగ్‌ నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్‌ శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో ఎస్పీ గౌతమి శాలితో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకూ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్నికల ఫలితాలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని సూచించారు.

అమలులో 144 సెక్షన్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉందని కలెక్టర్‌ తెలిపారు. అదే విధంగా 133 సెక్షన్‌ కింద ఇతరులకు హాని కలిగించే ఆయుధాలు, రాళ్లు, కర్రలు, తదితర వస్తువులు కలిగి ఉండకూడదన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసే జూన్‌ 6వ తేదీ వరకు బాణసంచా అమ్మకాలు, కొనుగోలు, రవాణా, వినియోగంపై నిషేధం విధించామన్నారు. దీన్ని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు.

హింసకు తావివ్వరాదు

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా హింసకూ తావివ్వరాదని ఎస్పీ గౌతమి శాలి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. హింస సృష్టించినా, సృష్టించాలని చూసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన బందోస్తు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎనిమిది మందిని జిల్లా నుంచి బహిష్కరణ చేశామన్నారు. గొడవలు చేస్తారని గుర్తించిన వారిని బైండోవర్‌ చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవి, నగర పాలక కమిషనర్‌ మేఘ స్వరూప్‌, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, రిటర్నింగ్‌ అధికారులు, అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు 1,354 మంది సిబ్బంది

ఓట్ల లెక్కింపు (కౌంటింగ్‌) ప్రక్రియ నిర్వహించేందుకు 1,354 మంది సిబ్బందిని నియమించామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎన్‌ఐసీలో కౌంటింగ్‌ సిబ్బందికి సంబంధించి ఒకటవ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్ట్టర్‌ నిర్వహించారు. ఈసీ ఆదేశాల మేరకు సీపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకతతో కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ చేపట్టామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎన్‌ఐసీ డీఐఓ రవిశంకర్‌, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలి

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement