పార్టీలో ఉన్నా పక్కలో బల్లెమే! | Sakshi
Sakshi News home page

పార్టీలో ఉన్నా పక్కలో బల్లెమే!

Published Thu, Apr 18 2024 10:45 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ్లనేటి నుంచి నామినేషన పర్వం ప్రారంభం కానుంది. పోలింగ్‌ కూడా మరెంతో దూరంలో లేదు. అయినా టీడీపీలో కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. పార్టీలో ఉంటూనే పక్కలో బల్లెంలా ఉన్న పరిస్థితితో చాలామంది అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ నాయకుడు ఏ వైపునుంచి తమ అస్త్రాలు ప్రయోగిస్తారో, తెరవెనుక ఎవరు గోతులు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. అసమ్మతులను స్వయానా పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి బుజ్జగిస్తున్నా కలిసి పనిచేయని పరిస్థితి నెలకొంది. నాయకులు ఎడమొహం పెడమొహంతో ఉండటంతో కార్యకర్తలు ఏ నాయకుని వైపు నడవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. శ్రీ సత్యసాయి, అనంతపురం రెండు జిల్లాల్లోనూ ఇదే దుస్థితి.

పార్థా..నీ కేడర్‌ ఎటువైపు?

ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి, రాకపోవడంతో చంద్రబాబు ఫ్లెక్సీలు దహనం చేసిన బీకే పార్థసారథి అనుచరులు ఇప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలవలేక పోతున్నారు. పార్థసారథి ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నా కేడర్‌లో పనిచేయించలేకపోతున్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన అనుచరులు పార్థకు ఓటు వేయండి.. మిగతా ఓటు ఎవరికై నా వేసుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు. వీళ్లిద్దరూ బయటికి కలిసి తిరుగుతున్నా.. అనుచరులు మాత్రం కలిసి పనిచేయలేక పోతున్నారు.

అంతుచిక్కని చౌదరి వర్గీయులు..

అనంతపురం అర్బన్‌లో టికెట్‌ దక్కక ఏకంగా పార్టీ కార్యాలయానికే నిప్పు పెట్టి రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ప్రభాకర్‌ చౌదరి కలిసినంత మాత్రాన తామెందుకు దగ్గుపాటి ప్రసాద్‌తో కలవాలి. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయో తెలియదు, తాము ఇప్పటికీ ప్రభాకర్‌ చౌదరిౖ వెపే ఉన్నామని కేడర్‌ అంటోంది. తాజాగా చౌదరికి పార్టీ పదవి ఇచ్చినా దగ్గుపాటికి మనస్ఫూర్తిగా చేయరనే విషయం తెలుగుదేశం నాయకుల్లో బలంగా వినిపిస్తోంది.

జితేందర్‌ గౌడ్‌ సహకారం లేదు

పేకాట మంత్రి అంటూ విమర్శించి చివరకు గుమ్మనూరు జయరాంకే టికెట్‌ ఇచ్చిన చంద్రబాబు తీరుపై గుంతకల్లులో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌ పార్టీలోనే ఉన్నా జయరాం కోసం పనిచేయడం లేదు. ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సహకరించడం లేదు. దీంతో జయరాం డబ్బునే నమ్ముకుని ముందుకు వెళుతున్నారు.

అమిలినేనికి ఆమడ దూరం

కళ్యాణదుర్గంలో పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఉన్నం హన్మంతరాయ చౌదరి వర్గం పార్టీలోనే ఉన్నా అమిలినేని సురేంద్రకు ఆమడ దూరంలో ఉన్నారు. ఆయన వర్గం మొత్తం అమిలినేనికి సహకరించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఉమామహేశ్వరనాయుడు పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ క్రమంలో కీలక నాయకుల సహకారం కొరవడి అమిలినేని సురేంద్ర బాబు దిక్కుతెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

మడకశిరలో మరీ దారుణం

మడకశిరలో డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వడంతో అలకబూనిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి.. సునీల్‌ను ఓడించడానికై నా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను చెప్పిన వారికి పదవి ఇవ్వకపోతే తానెందుకు పనిచేస్తా అని ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో తిప్పేస్వామి వర్గీయులంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థిని మారుస్తారేమోనన్న ప్రచారం జరుగుతోంది. శింగనమలలో సైతం బండారు శ్రావణికి ముఖ్య నాయకులెవరూ సహకరించడం లేదు. దీంతో సొంత పార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండటంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.

ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడో అని పట్టుకునే ఉన్నా..

టీడీపీలో వేరు కుంపట్లతో అభ్యర్థులు గగ్గోలు

పార్టీలో ఉంటూనే అభ్యర్థి ఓటమికి కృషి చేస్తున్న నేతలు

చంద్రబాబు బుజ్జగించినా మారని వైనం

Advertisement

తప్పక చదవండి

Advertisement