నియంత్రణలో హెచ్‌ఐవీ | Sakshi
Sakshi News home page

నియంత్రణలో హెచ్‌ఐవీ

Published Fri, Dec 1 2023 1:04 AM

- - Sakshi

అనంతపురం మెడికల్‌: ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి నియంత్రణ దిశలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు పటిష్ట చర్యలు చేపట్టడమే ఇందుకు కారణం. గతేడాది 1,001 కొత్త కేసులు నమోడు కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 628 కేసులను అధికారులు గుర్తించారు.

ఏఆర్‌టీ సెంటర్ల మందుల పంపిణీ

ఉమ్మడి జిల్లాలో 2002 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకూ 34,513 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు అధికారిక సమాచారం. కాగా, యాంటీరిట్రో వైరల్‌ చికిత్స (ఏఆర్‌టీ) కేంద్రాల్లో 27,289 మంది పేర్లు నమోదు చేసుకుని క్రమం తప్పకుండా మందులు వాడారు. ప్రస్తుతం జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న 15,406 మందికి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. హెచ్‌ఐవీతో జీవించే వారికి మెరుగైన సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఏపీ సాక్స్‌) అనంతపురంలోని జీజీహెచ్‌, పాతూరు సీడీ ఆస్పత్రి, నగరంలోని దీపు, చైతన్య ఆస్పత్రులు, గుంతకల్లు ఏరియా ఆస్పత్రి, గోపి ఆస్పత్రి, శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి, హిందూపురం, బత్తలపల్లి ఆర్డీటీ, పుట్టపర్తి ఆస్పత్రులెఓ్ల రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. హెచ్‌ఐవీ రోగులకు పరీక్షలు చేయడంతో పాటు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు జిల్లాలో 22 సమీకృత సలహా, పరీక్ష కేంద్రాలు(ఐసీటీసీ సెంటర్‌)లున్నాయి. సుఖ వ్యాధులతో బాధపడేవారి కోసం మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ సర్వజనాస్పత్రి, గుంతకల్లు, కదిరి ఏరియా, హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా సుఖ వ్యాధుల చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నేడు అవగాహన ర్యాలీ

ప్రపంచ ఎయిడ్స్‌ నియంత్రణ దినాన్ని పురస్కరించుకుని ఈ నెల 1న ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఎయిడ్స్‌ పై ప్రజలను చైతన్య పరుస్తూ భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకూ ర్యాలీ కొనసాగుతుంది.

సందర్భం : నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నియంత్రణ దినం

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15,406 కేసులు

హెచ్‌ఐవీ అదుపులో ఉన్న వారి సంఖ్య 12 వేలు

గతేడాది 1,001 కొత్త కేసులు

ఈ ఏడాది ఇప్పటి వరకూ 628 కేసులు నమోదు

సామాజిక స్పృహ తప్పనిసరి

సామాజిక స్పృహతోనే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ను నియంత్రించవచ్చునని వైద్యులు అంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శృంగారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితాంతం మందులు వాడుకుని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా యువత ముందుచూపుతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement