Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోనే మత్స్యకారులకు ప్రాధాన్యత

Published Fri, Mar 29 2024 1:50 AM

సమావేశానికి హాజరైన వలస మత్స్యకారులు  - Sakshi

నక్కపల్లి: మత్స్యకారులను గుర్తించి వారికి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. గురువారం స్థానిక సీనియర్‌ నాయకులతో కలిసి ఒరిస్సాలోని పూరీ, పారాదీప్‌లకు తాత్కాలిక వలస వెళ్లిన మత్స్యకార కుటుంబాలను అక్కడే కలిశారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగులును జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, ఎస్‌.రాయవరం వైస్‌ఎంపీపీ బొలిశెట్టి గోవిందు, నక్కపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మలు స్థానిక మత్స్యకారులకు పరిచయం చేశారు.

వారినుద్దేశించి కంబాల జోగులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుని రాజ్యాంగ పదవుల్లో మొండి చేయి చూపించారన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులైన మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవితోపాటు, రాజ్యసభ పదవి, సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన కోలా గురువులకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవితోపాటు, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. నక్కపల్లి జెడ్పీటీసీగా గోసల కాసులమ్మకు ఇచ్చారన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జగన్‌ ప్రభుత్వం చేసిన వేటనిషేధ భృతి రూ.10 వేలకు పెంపు, డీజీల్‌ సబ్సీడీ పెంపు లబ్ధిని వివరించారు. మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, మార్కెటింగ్‌ సదుపాయం పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం పోర్టులు, హార్బర్లు నిర్మిస్తోందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ఫిష్‌ల్యాండిగ్‌ సెంటర్లు, మినీ జెట్టీల నిర్మాణ ప్రగతిని వివరించారు. రాజయ్యపేటలో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటరు, మినీజెట్టీ పూర్తయితే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చేనెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మత్స్యకారుల మద్దతు చారిత్రక అవసరమన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి మళ్లీ జగనన్నను సీఎంగా గెలిపించుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు ధనిశెట్టి బాబూరావు, కొణతాల శ్రీనివాసరావు, కోడ కోటేశ్వరరావు, కంబాల సందీప్‌, యజ్జల అన్నవరం, ఆప్కాఫ్‌ వైస్‌ చైర్మన్‌, జిల్లా మత్స్సకార సంఘ నాయకుడు మాతా గురునాథరావు, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చోడిపల్లి శ్రీను, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులిచ్చిన ఘనత జగన్‌దే

వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు చారిత్రక అవసరం

వలస మత్స్యకారులతో సమన్వయకర్త కంబాల జోగులు

Advertisement

What’s your opinion

Advertisement